Students: ప్రాక్టికల్స్ లో మార్కులు తక్కువ వేశారంటూ టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు... వీడియో ఇదిగో!
- జార్ఖండ్ లో ఘటన
- పరీక్షల్లో ఫెయిలైన పలువురు విద్యార్థులు
- మాట్లాడదాం రండి అని టీచర్లను పిలిచి చెట్టుకు కట్టేసిన వైనం
- బెత్తాలతో ఒళ్లు హూనం చేసిన విద్యార్థులు
ఝార్ఖండ్ లో దిగ్భ్రాంతి కలిగించే ఘటన చోటుచేసుకుంది. గురు విష్ణు... గురు సాక్షాత్ పరబ్రహ్మ... గురుదేవో మహేశ్వరః అని గురువును దైవంగా భావించే దేశంలో సాక్షాత్తు గురువులపైనే విద్యార్థులు దాడి చేశారు. అయితే విద్యార్థులు తాము టీచర్లను కొట్టడానికి గల కారణాలున్నాయని చెబుతున్నారు.
అసలేం జరిగిందంటే... దుంకా ప్రాంతంలో ఓ గ్రామంలోని పాఠశాలలో ఇటీవల పై తరగతి విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించారు. అందులో చాలామంది విద్యార్థులకు అతి తక్కువ మార్కులు వచ్చాయి. దాంతో ఒళ్లుమండిన ఆ విద్యార్థులు టీచర్లను చెట్టుకు కట్టేశారు. బెత్తాలు, కర్రలు తీసుకుని ఒళ్లు హూనమయ్యేలా కొట్టారు.
టీచర్ల నిర్వాకం వల్ల తమకు ప్రాక్టికల్స్ లో అతి తక్కువ మార్కులు వచ్చాయని, తద్వారా తాము ప్రధాన పరీక్షల్లో ఫెయిలైనట్టుగా ఫలితాలు వచ్చాయని వారు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై దుంకా విద్యాధికారి సురేంద్ర హెబ్రామ్ స్పందించారు. ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని, ఆ పాఠశాలలోని టీచర్లందరితో మాట్లాడామని తెలిపారు.
తాము ఆ స్కూలు వద్దకు వెళ్లగా, తమకు ప్రాక్టికల్స్ లో చాలా తక్కువ మార్కులు వేశారని, ఇదేంటని అడిగితే టీచర్ల నుంచి సరైన స్పందన లేదని ఆ విద్యార్థులు చెప్పారని సురేంద్ర హెబ్రామ్ వివరించారు.
కాగా, విద్యార్థుల దాడిలో గాయపడిన కుమార్ సుమన్ అనే ఉపాధ్యాయుడు మీడియాకు వివరాలు తెలిపారు. మార్కుల విషయం మాట్లాడదాం రండి అని పిలిచి విద్యార్థులు తమను చెట్టుకు కట్టేశారని వాపోయారు. పరీక్ష ఫలితాల్లో ప్రాక్టికల్ మార్కులు కలపకపోవడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని, అందుకు కారకుడు హెడ్ మాస్టర్ అని ఉపాధ్యాయుడు కుమార్ సుమన్ ఆరోపించారు. ఇందులో తాము చేయడానికి ఏమీలేదని నిస్సహాయత వ్యక్తం చేశారు.