Telangana: ఆ నలుగురు ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు ప్రాథమికంగా తెలిసింది: హరీశ్ రావు
- ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై స్పందించిన మంత్రి హరీశ్ రావు
- నిమ్స్, అపోలో ఆసుపత్రుల్లోని బాధితులకు పరామర్శ
- రాజకీయాలు చేయడం కంటే బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి
- ఇప్పటికే మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించామన్న మంత్రి
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లలో భాగంగా హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో నలుగురు మహిళలు మరణించిన వైనంపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బుధవారం స్పందించారు. ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మిగతా వారిని ఆపోలో, నిమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్న నేపథ్యంలో బుధవారం మంత్రి వారిని ఆసుపత్రులకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ఘటన, తదనంతర పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ల తర్వాత చనిపోయిన నలుగురు మహిళలు ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందని ఆయన వెల్లడించారు.
ఇబ్రహీంపట్నం ఘటనలో నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరం, బాధాకరమన్న హరీశ్ రావు.. సంఘటన తమ దృష్టికి రాగానే అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో 13 మంది, నిమ్స్ లో 17 మంది చికిత్స పొందుతున్నారని, వారంతా ఆరోగ్యంగా ఉన్నారని ఆయన తెలిపారు. 2-3 రోజుల్లో అందరూ డిశ్చార్జి అవుతారని వెల్లడించారు. గడచిన 6-7 ఏళ్లలో 12 లక్షల ఆపరేషన్లు చేశామన్న మంత్రి... ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదన్నారు.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆసుపత్రి సూపరింటెండెంట్ మీద చర్యలు తీసుకున్నామన్న మంత్రి.. సర్జరీ చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు చేశామని తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశించామన్న హరీశ్ రావు.. నివేదిక రాగానే చర్యలు ఉంటాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారంతా క్షేమంగా ఉన్నారన్న మంత్రి... బాధితులకు ఉచిత చికిత్స ఇస్తున్నామని తెలిపారు. తాము రాజకీయాలు చేయమన్న హరీశ్.. ప్రజల ప్రాణాలు కాపాడామని తెలిపారు. బాధితులకు ఇప్పటికే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేశామన్న ఆయన.. త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇస్తామన్నారు. ప్రతిపక్షాలు ఇప్పుడు హాస్పిటల్ కి వచ్చి హడావుడి చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి.. ఘటన జరిగిన మరుక్షణం నుంచి రాత్రింబవళ్ళు బాధితులను కాపాడుకుంటున్నామని తెలిపారు.