Hinnamnor: గంటకు 257 కిమీ వేగంతో దూసుకొస్తున్న 'హిన్నామ్ నార్' సూపర్ టైఫూన్
- దక్షిణ చైనా సముద్రంలో టైఫూన్
- జపాన్ దక్షిణ ప్రాంత దీవుల వైపు పయనం
- 50 అడుగుల ఎత్తున ఎగసిపడుతున్న అలలు
- క్రమేపీ బలహీనపడే అవకాశం
దక్షిణ చైనా సముద్రంలో అత్యంత శక్తిమంతమైన టైఫూన్ కొనసాగుతోందని యూఎస్ జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు సంభవించిన సముద్ర విపత్తులను మించిన రీతిలో ఇది భీకరమైన ప్రభావం చూపించే అవకాశాలున్నాయని పేర్కొంది. కాగా, జపాన్ దక్షిణ ప్రాంతపు దీవుల దిశగా దూసుకువస్తున్న ఈ టైఫూన్ కు 'హిన్నామ్ నార్' అని నామకరణం చేశారు.
ఇది గంటకు 257 మైళ్ల వేగంతో సుడులు తిరుగుతూ పశ్చిమ నైరుతి దిశగా పయనిస్తోంది. దీని తీవ్రత దృష్ట్యా ఇప్పటికే సూపర్ టైఫూన్ కేటగిరీలో చేర్చారు. హిన్నామ్ నార్ సూపర్ టైఫూన్ ప్రభావంతో సముద్రపు అలలు 50 అడుగుల ఎత్తున ఎగసిపడుతున్నాయి.
హాంకాంగ్ లోని పరిశీలన కేంద్రం తెలియజేసిన వివరాల ప్రకారం... ప్రస్తుతం ఈ టైఫూన్ జపాన్ లోని ఒకినావాకు తూర్పున 230 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ నైరుతి దిశగా గంటకు 22 కిమీ వేగంతో జపాన్ లోని రియోకు ఐలాండ్స్ వైపు పయనిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సూపర్ టైఫూన్ బలహీనపడే అవకాశాలున్నాయని యూఎస్ జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ వెల్లడించింది.