alligator: అన్నదమ్ములు కలిసి వందేళ్ల మొసలిని పట్టేసుకున్నారు!
- అమెరికాలోని పెర్ల్ నదిలో పట్టుకున్న అన్నదమ్ములు
- ఏకంగా 10 అడుగుల రెండు అంగుళాల పొడవు ఉన్న మొసలి
- మిస్సిసిప్పి రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టుబడ్డ అతిపెద్ద మొసలిగా రికార్డు
ఎక్కడైనా నీటిలో మొసలి కనబడిందంటే హడలిపోవాల్సిందే. వందల కిలోల బరువుండే పెద్ద పెద్ద జంతువులను సైతం మొసళ్లు సులువుగా పట్టేసుకుని ఆరగించేస్తుంటాయి. అందులోనూ పెద్ద మొసళ్లు అయితే.. ఒక్కోసారి బోట్లనూ పల్టీ కొట్టిస్తుంటాయి. అలాంటి ఓ పెద్ద మొసలిని అమెరికాలోని మిస్సిస్సిప్పికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు జిమ్ డేన్సన్, రిచీ డేన్సన్ కలిసి చాకచక్యంగా పట్టేసుకున్నారు. మిస్సిస్సిప్పి వైల్డ్ లైఫ్, ఫిషరీస్ అండ్ పార్క్స్ డిపార్ట్ మెంట్ ఈ వివరాలను తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.
వలను తెగ్గొట్టుకుని మరీ..
పెర్ల్ నదిలో వేటకు వెళ్లిన జిమ్, రిచీ సోదరులకు ఈ పెద్ద మొసలి కనిపించింది. దాన్ని పట్టుకునేందుకు వల వేయగా.. మొసలి తీవ్రంగా ప్రతిఘటించింది. దీనితో వలకు బోటు నుంచి ఆధారంగా అమర్చిన బలమైన ఫిషింగ్ రాడ్, పోల్ విరిగిపోయాయి. మొత్తానికి ఎలాగోలా ప్రయత్నించి.. ఆ మొసలిని బోటులోకి ఎత్తి కట్టేశారు.
వందేళ్ల వయసుతో..
- మిస్సిస్సిప్పి వైల్డ్ లైఫ్, ఫిషరీస్ అండ్ పార్క్స్ డిపార్ట్ మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు పట్టుబడ్డ మొసళ్లలో ఇదే అతిపెద్దది.
- జిమ్, రిచీ సోదరులు పట్టుకున్న మొసలి పొడవు ఏకంగా పది అడుగుల 2 అంగుళాలు కావడం గమనార్హం. ఇది ఆడ మొసలి అని గుర్తించారు. దాని వయసు వందేళ్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
- అమెరికాలోని మిస్సిస్సిప్పి నదిలో ఏకంగా 38 వేల వరకు మొసళ్లు ఉన్నట్టు అధికారవర్గాల అంచనా. ఈ క్రమంలో మొసళ్లు వేటాడటంపై నిషేధం ఏమీ లేదు. వేట వల్ల వాటి సంతతి నియంత్రణలో ఉంటుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- కాకపోతే వేటపై పరిమితులు మాత్రం ఉన్నాయి. ఎవరైనా ఒక ఏడాదిలో నాలుగు అడుగులకన్నా పొడవైన రెండు మొసళ్లనుగానీ.. ఏడు అడుగులకన్నా పొడవైన ఒక మొసలిని గానీ వేటాడేందుకు అనుమతి ఉంటుంది.