Nitish Kumar: సీఎం కేసీఆర్ పై పొగడ్తల జల్లు కురిపించిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్
- పాట్నా వెళ్లిన సీఎం కేసీఆర్
- నితీశ్ కుమార్ తో కలిసి అమరజవాన్ల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
- సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పదన్న నితీశ్ కుమార్
- మిషన్ భగీరథ పథకం గొప్పదని కితాబు
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు బీహార్ పర్యటనకు వెళ్లారు. గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో అమరులైన భారత జవాన్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ తో కలిసి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సీఎం కేసీఆర్ ను ఆకాశానికెత్తేశారు.
అమరజవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు దేశంలో మరే రాష్ట్రం ముందుకు రాకపోయినా, తెలంగాణ ముందుకొచ్చిందని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ సర్కారు అమరజవాన్ల కుటుంబాలకు ఆసరాగా నిలవడం గొప్ప విషయం అని పేర్కొన్నారు. అసలు, అమరవీరులను ఆదుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనే గొప్పదని నితీశ్ కుమార్ కొనియాడారు.
ఇక, తెలంగాణలో మిషన్ భగీరథ అద్భుతమైన పథకం అని, ఆ పథకం తీరుతెన్నులు పరిశీలించేందుకు కొందరు అధికారులను తెలంగాణకు వెళ్లిరావాలంటూ ఆదేశించానని ఈ సందర్భంగా వివరించారు. గ్రామగ్రామానికి తాగునీరు అందించడం భేషైన పథకం అని పేర్కొన్నారు. కరోనా సంక్షోభం సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేయూతనిచ్చిందని వెల్లడించారు.