Bihar: పోర్ట్ ఫోలియా అప్పగించిన కాసేపటికే కళంకిత బీహార్ మంత్రి రాజీనామా
- కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీక్ కుమార్
- ప్రతిపక్షాల విమర్శలతో న్యాయశాఖ నుంచి తప్పించి చెరుకు పరిశ్రమల శాఖ అప్పగింత
- ఆ తర్వాత గంటల వ్యవధిలోనే కార్తీక్ రాజీనామా
కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మంత్రి, ఆర్జేడీ నేత కార్తీక్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆమోదించి గవర్నర్‌కు పంపించారు. న్యాయశాఖ మంత్రిగా ఉండి పలు క్రిమినల్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీక్‌పై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన సీఎం నితీశ్ కుమార్ ఆయనను న్యాయ మంత్రిత్వ శాఖ పదవి నుంచి తప్పించి చెరుకు పరిశ్రమల మంత్రిత్వశాఖ అప్పగించారు. అయితే, ఆ తర్వాత గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం, రాజీనామా లేఖను నితీశ్ కుమార్ గవర్నర్‌కు పంపడం చకచకా జరిగిపోయాయి.
కుమార్‌కు కేబినెట్‌లో చోటు కల్పించడంపై పునరాలోచించాలంటూ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీపీఐఎంఎల్, కాంగ్రెస్ పార్టీలు నితీశ్‌ను కోరిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కుమార్ రాజీనామా చేసిన వెంటనే బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ స్పందించారు. ఫస్ట్ వికెట్ పడిందని, మరిన్ని వికెట్లు పడడం ఖాయమని ట్వీట్ చేశారు.