Tammareddy Bharadwaj: ఎగిరెగిరి పడితే ఫలితం ఇలాగే ఉంటుంది.. 'లైగర్'పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు
- డిజాస్టర్ గా మిగిలిపోయిన 'లైగర్' సినిమా
- ట్రైలర్ చూసినప్పుడే తనకు సినిమా చూడాలనిపించలేదన్న తమ్మారెడ్డి
- భవిష్యత్తులో చూడాలనిపిస్తే చూస్తానని వ్యాఖ్య
విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లైగర్' భారీ అంచనాల మధ్య విడుదలై... చివరకు పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పీడకలలా మిగిలిపోయింది.
మరోవైపు ఈ సినిమాపై టాలీవుడ్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగిరెగిరి పడితే ఇలాంటి అనుభవాలే ఎదురవుతాయని ఆయన అన్నారు. కేవలం సినిమా అనే కాకుండా... ఏ విషయంలో కూడా ఎవరూ ఎగిరెగిరి పడకూడదని చెప్పారు. ఇలా చేస్తే చివరకు ఎదురుదెబ్బలే మిగులుతాయని అన్నారు.
తామంతా ఎంతో కష్టపడి సినిమా చేశామని... తమ సినిమాను ఆదరించాలని, తమ సినిమాను చూడాలని ప్రేక్షకులను కోరుతూ ప్రమోషన్ చేసుకుంటే బాగుంటుందని తమ్మిరెడ్డి చెప్పారు. ఇలా కాకుండా చిటికెలు వేస్తూ మాట్లాడితే... ప్రేక్షకులు ఇచ్చే సమాధానం ఇలాగే ఉంటుందని అన్నారు. 'లైగర్' ట్రైలర్ చూసినప్పుడే సినిమా చూడాలని తనకు అనిపించలేదని చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో చూడాలనిపిస్తే చూస్తానని అన్నారు. తాను పూరీ జగన్నాథ్ అభిమానినని, ఆయన సినిమాలంటే తనకు చాలా ఇష్టమని... అయినప్పటికీ, ట్రైలర్ తోనే 'లైగర్'పై తనకు ఆసక్తి పోయిందని చెప్పారు.