YSRCP: ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా మల్లాది విష్ణు... కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మల్లాది విష్ణు
- కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు మొదలుపెట్టిన బెజవాడ నేత
- బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా కొనసాగిన వైనం
ఏపీలోని వైసీపీ సర్కారు గురువారం మరో కీలక నియామకాన్ని చేపట్టింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మల్లాది విష్ణును ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న మల్లాది విష్ణుకు కేబినెట్ హోదా కల్పిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు ప్రారంభించిన మల్లాది విష్ణు... విజయవాడ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి ముఖ్య అనుచరుడిగా సాగిన మల్లాది... వైఎస్సార్ మరణం తర్వాత కూడా అదే పార్టీలో కొనసాగారు. 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలో చేరిన ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాదికి జగన్ కేబినెట్‌లో చోటు తప్పనిసరి అంటూ ప్రచారం జరిగినా... ఆ దిశగా అవకాశం దక్కలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా ఓ దఫా కొనసాగిన ఆయనకు తాజాగా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి దక్కడం గమనార్హం.