YSRCP: కడప జిల్లాలో జగన్ పర్యటన... వేల్పుల సచివాలయ భవనాన్ని ప్రారంభించిన సీఎం
- గన్నవరం నుంచి కడప ఎయిర్ పోర్టు చేరుకున్న జగన్
- అక్కడి నుంచి వేల్పుల గ్రామం చేరిన ఏపీ సీఎం
- రేపు వైఎస్సార్ ఘాట్‌లో తన తండ్రికి నివాళి అర్పించనున్న వైనం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం తన సొంత జిల్లా కడపలో పర్యటనను ప్రారంభించారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న జగన్... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో తన సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని వేముల మండలం వేల్పుల గ్రామం చేరుకున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమం అనంతరం వేంపల్లి మండల పరిధిలోని ఇడుపులపాయ ఎస్టేట్ చేరుకోనున్న జగన్... ఈ రాత్రికి అక్కడి తన గెస్ట్ హౌస్‌లో బస చేయనున్నారు. రేపు ఉదయం తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్ ఘాట్‌లో నివాళి అర్పిస్తారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్దిపై అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత రేపు రాత్రి కూడా ఇడుపులపాయ గెస్ట్ హౌస్‌లోనే బస చేయనున్న జగన్...ఎల్లుండి ఉదయం తిరిగి కడప ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం విమానాశ్రయం, అక్కడి నుంచి తాడేపల్లిలోని తన ఇంటికి చేరుకుంటారు.