Congress: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలన్న ముగ్గురు ఎంపీలు... ససేమిరా అన్న హైకమాండ్
- అక్టోబరు 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు
- సెప్టెంబరు 22న నోటిఫికేషన్
- ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశం
- ఓటర్ల జాబితాను ప్రస్తావించిన ఆనంద్ శర్మ
- డిమాండ్ చేసిన మనీశ్ తివారీ, శశిథరూర్, కార్తీ చిదంబరం
సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్ లో త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబరు 22న నోటిఫికేషన్ వెలువడనుండగా, అక్టోబరు 17న ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ అందుకు అంగీకరించలేదు.
కాంగ్రెస్ లో అసమ్మతి వర్గంగా పేరుపొందిన జీ-23 నేత ఆనంద్ శర్మ ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఈ ప్రతిపాదనను తొలిసారిగా తెరపైకి తెచ్చారు. తాజాగా ముగ్గురు ఎంపీలు ఓటర్ల జాబితా బహిర్గతం చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
ఎంపీ మనీశ్ తివారీ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను వెల్లడించాల్సిందేనని పట్టుబట్టారు. అందుకు శశిథరూర్, కార్తీ చిదంబరం సైతం వంతపాడారు. అయితే, ఈ డిమాండ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని కాంగ్రెస్ అధినాయకత్వం స్పష్టం చేసింది. ఇలాంటి విధానాలు గతంలో లేవని, పాత పద్ధతిలోనే ముందుకెళతామని తేల్చిచెప్పింది.
కాంగ్రెస్ పార్టీ కేంద్రీయ ఎన్నికల వ్యవస్థ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ దీనిపై స్పందించారు. పీసీసీ ఓటర్ల జాబితాలను రాష్ట్రాల ప్రధాన కార్యాలయాలకు పంపుతామని, మొత్తం ఓటర్లతో కూడిన జాబితాలను అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులకు అందజేయడం జరుగుతుందని వివరించారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, ఇది పార్టీ లోపల జరుగుతున్న వ్యవహారం అని, జాబితాలను అందరూ చూడ్డానికి ఇదేమీ పబ్లిక్ వ్యవహారం కాదని అభిప్రాయపడ్డారు. మునుపెన్నడూ ఇలాంటి విధానాలు పాటించలేదని, ఇప్పటివరకు ఎలాంటి విధానాలు అమల్లో ఉన్నాయో వాటినే అనుసరిస్తామని స్పష్టం చేశారు.