Andhra Pradesh: అనంత ఎస్పీపై కేసు విచారణాధికారిగా చిత్తూరు జిల్లా డీఎస్పీ నియామకం
- సేవ్ ఏపీ పోలీస్ అంటూ ప్లకార్డు ప్రదర్శించిన ఏఆర్ కానిస్టేబుల్
- తనను సస్పెండ్ చేసిన పోలీసు అధికారులపై కానిస్టేబుల్ ఫిర్యాదు
- కేసు విచారణాధికారిగా పలమనేరు డీఎస్పీ గంగయ్య నియామకం
అనంతపురం జిల్లా ఎస్పీ, ఏఎస్పీపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో విచారణాధికారిని నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు విచారణాధికారిగా చిత్తూరు జిల్లా పలమనేరు డీఎస్పీ గంగయ్యను నియమిస్తూ అనంతపురం రేంజీ డీఐజీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇటీవల అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ 'సేవ్ ఏపీ పోలీస్' అంటూ ప్లకార్డు పట్టుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ప్రదర్శనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన జిల్లా ఎస్పీ సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.
ఈ నేపథ్యంలో తనపై చర్యలు తీసుకున్న ఎస్సీతో పాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏఎస్పీ, డీఎస్పీలపై సస్పెండ్ అయిన కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు మేరకు ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిష్పక్షపాత విచారణ కోసం ఇతర జిల్లాల అధికారులను నియమించాలన్న ప్రతిపాదన మేరకు పలమనేరు డీఎస్పీని విచారణాధికారిగా నియమిస్తూ డీఐజీ నిర్ణయం తీసుకున్నారు.