Nirmala Sitharaman: రాష్ట్రాలు చేసే అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉంది: నిర్మలా సీతారామన్
- తెలంగాణ పర్యటనకు విచ్చేసిన కేంద్ర ఆర్థికమంత్రి
- కామారెడ్డిలో మీడియా సమావేశం
- తెలంగాణ బడ్జెట్ కంటే ఎక్కువ అప్పులు చేస్తున్నారని వెల్లడి
- రాష్ట్రంలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు ఉందని వెల్లడి
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ పర్యటనకు విచ్చేశారు. కామారెడ్డిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో ఆమోదించిన బడ్జెట్ కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. వెలుపల తీసుకునే అప్పులు అసెంబ్లీకి తెలియడంలేదని వెల్లడించారు. బడ్జెట్ లో చాలా అప్పుల ప్రస్తావనే లేదని ఆరోపించారు. రాష్ట్రాల అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ఒకప్పుడు ఉన్న మిగులు బడ్జెట్ ఇప్పుడు లోటు బడ్జెట్ గా మారిపోయిందని విమర్శించారు. తెలంగాణలో పుట్టే ప్రతి బిడ్డపై రూ.1.25 లక్షల అప్పు ఉందని పేర్కొన్నారు. ఎఫ్ఆర్ బీఎం పరిధిని తెలంగాణ ఎప్పుడో దాటిపోయిందని వెల్లడించారు. ప్రజలకు నిజాలు తెలిసిపోతాయన్న ఉద్దేశంతోనే తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ లో చేరడంలేదని నిర్మలా సీతారామన్ ఆరోపించారు.