Cristina Fernandez: అర్జెంటీనా ఉపాధ్యక్షురాలిపై హత్యాయత్నం... పేలని తుపాకీ... వీడియో ఇదిగో!

Murder attempt on Argentina vice president Cristina Fernandez

  • బ్యూనోస్ ఎయిర్స్ లో ఘటన
  • మద్దతుదారులను పలకరించేందుకు వచ్చిన క్రిస్టినా
  • అత్యంత సమీపం నుంచి తుపాకీ గురిపెట్టిన ఆగంతుకుడు
  • ట్రిగ్గర్ నొక్కినా గుండు బయటికి రాని వైనం
  • ఓ బ్రెజిల్ జాతీయుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు

అర్జెంటీనా ఉపాధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నెండెజ్ పై హత్యాయత్నం జరిగింది. అయితే తుపాకీ పేలకపోవడంతో ఆమెకు పెనుముప్పు తప్పింది. రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ లోని తన నివాసం వద్దకు వచ్చిన మద్దతుదారులను పలకరించేందుకు క్రిస్టినా ఫెర్నాండెజ్ బయటికి వచ్చారు. మద్దతుదారుల మధ్యకు వచ్చి వారికి అభివాదం చేస్తుండగా, ఇంతలో గుంపులోంచి ఓ వ్యక్తి ఉపాధ్యక్షురాలికి అత్యంత సమీపం నుంచి తుపాకీ గురిపెట్టాడు. కానీ ట్రిగ్గర్ నొక్కినా తుపాకీ పేలకపోవడంతో గుండు బయటికి రాలేదు. 

అనంతరం ఆ ఆగంతుకుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, ప్రజలు అతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ హత్యాయత్నం ఘటనకు సంబంధించి పోలీసులు ఫెర్నాండో ఆండ్రెస్ సబాబ్ మాంటియెల్ (35) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిని బ్రెజిల్ జాతీయుడిగా గుర్తించారు. 

దీనిపై అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఫెర్నాండెజ్ స్పందిస్తూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాక అత్యంత తీవ్ర ఘటన ఇదేనని అభివర్ణించారు. ఉపాధ్యక్షురాలు క్రిస్టినాకు ఎలాంటి ఆపద వాటిల్లలేదని, ఆమె క్షేమంగా ఉన్నారని తెలిపారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకీలో 5 బుల్లెట్లు లోడ్ చేసి ఉన్నాయని, కానీ ఆ తుపాకీ పేలలేదని వెల్లడించారు. అతడు ఎందుకు కాల్చాలని ప్రయత్నించాడో తెలియాల్సి ఉందన్నారు. 

కాగా, ఉపాధ్యక్షురాలిపై హత్యాయత్నానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.

  • Loading...

More Telugu News