Jelly fish: ఇక వృద్ధాప్యం రానే రాదు.. చావులేని ఈ జెల్లీ ఫిష్‌ మనకు దారి చూపుతుందంటున్న పరిశోధకులు!

Old age does not come us Immortal jellyfish can show the way says researchers

  • సముద్రం లోతుల్లో బతికే ‘టురిటోప్సిన్‌ డోహ్రిని’ జెల్లీ ఫిష్‌
  • అవసరమైనప్పుడు తిరిగి పూర్వ స్థితికి మారిపోయే సామర్థ్యం
  • మళ్లీ ఎదుగుతూ పూర్తిస్థాయి జెల్లీ ఫిష్‌ గా మారిపోయే తీరు

రోజు రోజుకు మన వయసు పెరిగిపోతుంది. పిల్లలు పెద్దవాళ్లు అయి.. ఆపై వృద్ధులై.. శరీరం ఉడిగిపోతుంటుంది. ఇలా కాకుండా ఎప్పటికీ వయసు పెరగకుండా అలాగే ఉండిపోతే బాగుంటుందని అందరికీ అనిపిస్తుంటుంది. ఇది మన వరకు కల ఏమోగానీ.. భూమ్మీద కొన్నిరకాల జీవులకు మాత్రం ఇది సాధ్యమే.

అలా యంగ్‌ గానే వందలు వేల ఏళ్లు బతికే జీవులు కొన్ని ఉంటే.. పెరిగిన వయసును వెనక్కి తెచ్చుకుని.. మళ్లీ పెరుగుతూ ఉండే జీవులూ కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ‘టురిటోప్సిస్‌ డోహ్రిని (టి.డోహ్రిని)’ అనే ఓ జెల్లీ ఫిష్‌ మరింత ప్రత్యేకమైనది. దీనిమీద పరిశోధన చేపట్టిన స్పెయిన్‌ లోని ఒవిడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. భవిష్యత్తులో మనుషులు కూడా వయసు పెరగకుండా ఎక్కువకాలం జీవించేందుకు ఇది మార్గం చూపిస్తుందని అంటున్నారు.

చావే లేని జీవిగా.. సముద్రాల్లో ఉండే పలు రకాల జీవులకు సుదీర్ఘకాలం జీవించే సామర్థ్యం ఉంది. కొన్ని జీవులైతే ఏడెనిమిది వందల ఏళ్లు కూడా జీవించగలవని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. ఇంకొన్ని జీవులు తమను తాము పునరుద్ధరించుకోవడం ద్వారా అసలు చావే లేకుండా జీవిస్తాయని తేల్చారు. హైడ్రా, జెల్లీ ఫిష్‌ లు వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి. అయితే దీనికి పరిమితి ఉంది, పునరుత్పత్తి చేయగలిగే దశ వరకు మాత్రమే వాటికి పునరుద్ధరించుకునే సామర్థ్యం ఉంటుంది. ఇటీవల ఒవిడో వర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించిన టురిటోప్సిస్‌ డొహ్రిని (టి.డోహ్రిని) జెల్లీ ఫిష్‌ మాత్రం మరింత ప్రత్యేకమని తేల్చారు. ఇది జీవితంలో ఎప్పుడైనా తిరిగి తన వయసును వెనక్కి తగ్గించుకుంటోందని గుర్తించారు.

ఎక్కడిది ఈ సామర్థ్యం?
జీవులు ఎదుగుతున్న కొద్దీ, కాలం గడుస్తున్న కొద్దీ శరీరంలో కణాలు విభజన చెందుతుంటాయి. ఈ క్రమంలో జన్యువుల్లో మార్పులు జరుగుతుంటాయి. కణాల్లోని క్రోమోజోమ్‌ల చివరన ఉండే టెలోమెర్ల పొడవు తగ్గిపోతూ ఉంటుంది. ఇవి కణాల వయసుకు సూచికగా ఉంటాయి. దీనివల్ల కొత్త కణాలు పుడుతున్నా కూడా.. అవి అప్పటికి ఆ జీవి ఉన్న వయసుకు తగినట్టుగా ఉంటాయి.
  • ఉదాహరణకు 60 ఏళ్ల వ్యక్తిలో చర్మం దెబ్బతిని కొత్త చర్మకణాలు ఏర్పడినా.. అవి 60 ఏళ్ల వయసున్న కణాల్లానే రూపొందుతాయి.
  • కానీ టి.డోహ్రిని జెల్లీ ఫిష్‌ లో మాత్రం వయసు పెరిగిపోతున్నా.. కొత్త కణాలు తక్కువ వయసువాటిలా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జెల్లీ ఫిష్‌ లోని కణాల్లో జన్యువులన్నీ రెండు సెట్లుగా ఉండటమే దీనికి కారణమని తేల్చారు.
  • ప్రధాన జన్యువుల్లో మార్పులు జరిగినా, దెబ్బతిన్నా.. మరో సెట్‌లోని జన్యువులు విడుదల చేసే ప్రొటీన్లు ఎప్పటికప్పుడు మరమ్మతు చేసి సరిచేస్తున్నాయని.. టెలోమెర్ల పొడవు కూడా తగ్గకుండా చూసుకుంటున్నాయని గుర్తించారు.

మళ్లీ చిన్న పిల్లల్లా మారిపోయి..
  • టి.డోహ్రిని జెల్లీ ఫిష్‌ లకు వయసు తగ్గించుకుని పూర్వ స్థితికి వెళ్లే సామర్థ్యం ఉన్నట్టు గుర్తించారు. వాటికి అవసరమైనప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు.. అవి వాటి పూర్వరూపమైన ‘సిస్ట్‌, పాలిప్‌ (పిండం రూపంలోకి అనుకోవచ్చు)’లుగా మారిపోతున్నాయి. తర్వాత మళ్లీ చిన్న వయసు నుంచి పూర్తిస్థాయి జీవిగా ఎదుగుతున్నాయి.  
  • ఈ సామర్థ్యం వెనుక ఉన్న జన్యువులు, ప్రోటీన్లు, ఇతర అంశాలను గుర్తించడం ద్వారా.. మనుషులు వయసు పెరగకుండా ఉండే అవకాశాలను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • అంతేగాకుండా జన్యు సంబంధ వ్యాధులు, ఇతర రోగాలకు సమర్థవంతమైన చికిత్సలను అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు.
  • భవిష్యత్తులో వృద్ధాప్యాన్ని ఎక్కువకాలం దూరం పెట్టి.. యంగ్‌ గా ఉండేలా తోడ్పడే ఔషధాలు, చికిత్సలనూ రూపొందించవచ్చని పేర్కొంటున్నారు.
  • ఇటీవలే ఈ పరిశోధన వివరాలు నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

  • Loading...

More Telugu News