Supreme Court: సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- హిందీతో పాటు సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని వంజారా పిటిషన్
- సంస్కృతం ఉచ్చారణతో ఎన్నో ఉపయోగాలున్నాయని వెల్లడి
- ఈ అభ్యర్థన పార్లమెంటులో చేయాలన్న సుప్రీంకోర్టు
సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై ఆశ్రయించాల్సింది కోర్టులను కాదని, పార్లమెంటును సంప్రదించాలని సూచించింది. అంతేకాకుండా సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలన్న పిటిషన్‌ను సంస్కృతంలోనే రాయాల్సి ఉందని కూడా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
హిందీతో పాటు సంస్కృతాన్ని కూడా జాతీయ భాషగా ప్రకటించాలని కోరుతూ గుజరాత్ మాజీ అదనపు కార్యదర్శి కేజీ వంజారా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంస్కృత ఉచ్చారణలో జీవశక్తి ఉంటుందని, అది మెదడును చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సంస్కృతి యొక్క లయబద్ధమైన ఉచ్చారణ పిల్లల్లో జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుందని కూడా వంజారా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.