Brahmāstra: ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు క్షమాపణలు చెప్పిన ఎన్టీఆర్
- గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో బందోబస్తు ఇవ్వలేమన్న పోలీసులు
- ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేసిన చిత్ర బృందం
- అమితాబ్ బచ్చన్ ప్రభావం తనపై ఎంతో ఉందన్న ఎన్టీఆర్
- రణ్‌బీర్‌తో కలిసి వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్న నటుడు
- కరణ్ జొహార్ గణేశ్ పూజ సరిగా చేయకపోవడం వల్లేనంటూ నవ్వులు కురిపించిన రాజమౌళి
వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రారంభం కావడంతో తాము బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు తేల్చిచెప్పడంతో నిన్న సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ‘బ్రహ్మస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషించారు. పాన్ ఇండియా చిత్రమైన ఇది ఈ నెల 9న విడుదల కానుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో ప్రముఖ నటుడు ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి సహా బ్రహ్మాస్త్ర చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది.
ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బ్రహ్మాస్త్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలనుకున్న తన అభిమానులకు తొలుత క్షమాపణలు తెలిపారు. మీడియాను కూడా క్షమించమని వేడుకున్నారు. వినాయక విగ్రహ నిమజ్జనం కారణంగా పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయలేమని పోలీసులు చెప్పారని, వారు ఉండేది మన భద్రత కోసమే కాబట్టి వారు చెప్పింది వినడం మన ధర్మమని పేర్కొన్నారు. వారికి తాము సహకరించామని, అందుకనే ఇలా చిన్న వేదికపై నుంచి మాట్లడాల్సి వస్తోందని అన్నారు.
ఓ నటుడిగా అమితాబ్ బచ్చన్ ప్రభావం తనపై ఉందన్న ఎన్టీఆర్.. ఆయనకు తాను వీరాభిమానినని అన్నారు. ఆయన తర్వాత అంతగా ఇష్టపడేది రణ్‌బీర్‌నని పేర్కొన్నారు. ఆయనతో కలిసి ఈ వేడుకను పంచుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. అలాగే, అలియా, అయాన్‌తోపాటు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పారు. మనపై ఒత్తిడి ఉన్నప్పుడు మరింత బాగా పనిచేయగలుగుతామన్న విషయాన్ని తాను నమ్ముతానన్నారు. తెలుగు నటుడు హిందీ సినిమాలో నటించి హిందీ మాట్లాడితే ఎలా ఉంటుందనే విషయాన్ని తాను నాగార్జున బాబాయ్ నటించిన ‘ఖుదాగవా’ చూసి తెలుసుకున్నానని అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ.. ఈవెంట్ నిర్వహణకు పోలీసు అధికారుల నుంచి అనుమతి పొందినప్పటికీ గణేశ్ నిమజ్జనాలు ఎక్కువగా ఉండడం వల్ల బందోబస్తు ఏర్పాటు చేయలేకపోతున్నామని చెప్పడంతోనే ఈవెంట్‌ను రద్దు చేసుకున్నట్టు చెప్పారు. ఈవెంట్‌కు అద్భుతమైన ఏర్పాట్లు చేశారని, టీమంతా బాగా కష్టపడినా అనుకున్నట్టుగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏమైనా కరణ్ జొహర్ గణేశ్ పూజ సరిగా చేసి ఉండకపోవడం వల్ల ఇలా జరిగిందేమోనని నవ్వుతూ చమత్కరించారు. ఈ సినిమాలో రణ్‌బీర్ అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాడని, అందుకు తగ్గట్టుగానే ఈవెంట్‌లో ఎన్టీఆర్ తొడకొడితే ఫైర్ వచ్చేలా ప్లాన్ చేశామని అన్నారు. ఈవెంట్ రద్దు కావడంతో చూపించడం సాధ్యం కాలేదని, సక్సెస్ ఈవెంట్‌లో దానిని చూపిస్తామని రాజమౌళి అన్నారు.