Serena Williams: ఓటమితో కెరీర్ ను ముగించిన టెన్నిస్ దిగ్గజం సెరెనా
- యూఎస్ ఓపెన్ సింగిల్స్ మూడో రౌండ్లో ఓడిన విలియమ్స్
- డబుల్స్ లో ఇప్పటికే తొలి రౌండ్ లోనే పరాజయం
- యూఎస్ ఓపెనే తనకు చివరి టోర్నీ అని చెప్పిన సెరెనా
యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో అమెరికా దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ పోరాటం ముగిసింది. శనివారం ఉదయం జరిగిన విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్ లో సెరెనా 5-7, 7-6 (7/4), 1-6 తో ఆస్ట్రేలియాకు చెందిన అజ్లా తొమ్జనోవిచ్చేతిలో పోరాడి ఓడిపోయింది. ఈ టోర్నీతో కెరీర్ ను ముగిస్తానని సెరెనా గతంలోనే ప్రకటించింది.
దాంతో, సుదీర్ఘ, అత్యంత విజయవంతమైన కెరీర్ కు సెరెనా ఓటమితో వీడ్కోలు చెప్పినట్టు కనిపిస్తోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘రిటైర్మెంట్ పై పునరాలోచన చేస్తారా?’ అని కోర్టులో వ్యాఖ్యాత ప్రశ్నించినప్పుడు.. ‘నేను అలా అనుకోవడం లేదు, కానీ మీకు ఎప్పటికీ తెలియదు’ అని సమాధానం ఇచ్చింది.
తన సుదీర్ఘ కెరీర్లో సెరెనా 23 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గింది. దాంతో, ఈ తరంలో అత్యధిక టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. అయితే, వయసు మీద పడటం, గాయాల కారణంగా గత ఐదేళ్లలో ఆమె ఒక్క గ్రాండ్ స్లామ్ కూడా గెలవలేకపోయింది. దాంతో, 41 ఏళ్ల సెరెనా కెరీర్ ముగించాలని నిర్ణయానికి వచ్చింది.
ఇక తన జీవిత ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగిందని సెరెనా చెప్పింది. కెరీర్లో తనను ప్రోత్సహించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెప్పింది. వారి వల్లే తాను ఇంత దూరం వచ్చానని తెలిపింది. తల్లిదండ్రుల వల్ల ఆటలోకి వచ్చిన తనకు అక్క వీనస్ విలియమ్స్ అండగా నిలిచిందని చెప్పింది. వీనస్ లేకపోతే సెరెనా లేదని అభిప్రాయపడింది.