asia cup: పాక్‌తో మ్యాచ్ కోసం ప్రత్యేక స్పోర్ట్స్ మాస్క్ పెట్టుకొని కోహ్లీ శిక్షణ
- హై అల్టిట్యూడ్ మాస్కు పెట్టుకొని గ్రౌండ్ లో రన్నింగ్ చేసిన విరాట్
- రేపు పాకిస్థాన్ తో మరోసారి తలపడనున్న భారత్
- ఈ పోరులో కీలకం కానున్న విరాట్ కోహ్లీ
ఆసియా కప్ లో భారత్ మరోసారి పాకిస్థాన్ తో తలపడనుంది. పాక్ ను ఓడించి టోర్నమెంట్లో బోణీ కొట్టిన టీమిండియా ఆదివారం జరిగే సూపర్ 4 రౌండ్ మ్యాచ్ లో మళ్లీ దాయాది జట్టును ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ కోసం భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సన్నద్ధం అవుతున్నాడు. ఎత్తైన ప్రాంతాల్లో వాడే హై అల్టిట్యూడ్ స్పోర్ట్స్ మాస్క్ పెట్టుకొని శిక్షణ పొందుతున్నాడు.
దాదాపు రెండేళ్ల నుంచి పేలవ ఫామ్ లో ఉన్న కోహ్లీ.. పాకిస్థాన్ తో గత ఆదివారం జరిగిన మ్యాచ్ తో తిరిగి ఫామ్ అందుకున్నాడు. పాక్ పదునైన బౌలింగ్ ను ఎదుర్కొని 34 బంతుల్లో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. తర్వాత హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.
ఈ నేపథ్యంలో పాక్ తో మరో హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఈ పోరుపై కోహ్లీ దృష్టి సారించాడు. మరో మెరుపు ఇన్నింగ్స్ తో టీ20 ప్రపంచ కప్పుకు ముందు ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం దుబాయ్ స్టేడియంలో హై అల్టిట్యూడ్ మాస్క్ పెట్టుకొని రన్నింగ్ చేస్తూ కనిపించాడు.
ఈ మాస్క్ అథ్లెట్ల శ్వాస కండరాలను బలోపేతం చేయడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం యూఏఈ లో వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంది. దాంతో, అనేక మంది ఆటగాళ్లు కండరాల గాయాలతో ఇబ్బంది పడుతూ కనిపించారు. పాకిస్థాన్ యువ బౌలర్ నసీమ్ షా ఇందుకు ఉదాహరణ. భారత్ తో మ్యాచ్ లో అతను చివరి ఓవర్లో కండరాల నొప్పితో ఇబ్బంది పడటం కనిపించింది.
మరోవైపు వెస్టిండీస్, జింబాబ్వే టూర్లకు దూరంగా ఉండి దాదాపు నెలన్నర తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన కోహ్లీ తొలి రెండు మ్యాచ్ ల్లోనూ కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఈ రెండు మ్యాచ్ లలో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పెద్దగా ఆకట్టుకోలేపోయారు. ఈ నేపథ్యంలో ఆదివారం పాకిస్థాన్ తో జరిగే సూపర్4 మ్యాచ్ లోనూ కోహ్లీ భారత్‌కు కీలకం కానున్నాడు.