Tollywood: మోహన్ బాబు సంస్కారం ఏంటో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా: బెనర్జీ
- ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించిన బెనర్జీ
- చిరంజీవి వల్ల 'మా' ఎన్నికల్లో పాల్గొన్నానని వెల్లడి
- మోహన్ బాబుతో మాట్లాడిన తర్వాతే ప్రకాశ్ రాజ్ ను చిరంజీవి ఓకే చేశారని వెల్లడి
ఆమధ్య జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రచ్చరచ్చ అయిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలపై సీనియర్ నటుడు బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలి నుంచి కూడా తాను వివాదాలకు దూరంగానే ఉంటూ వస్తున్నానని చెప్పారు. చిరంజీవి వల్ల తాను 'మా' ఎన్నికల్లో పాల్గొన్నానని చెప్పారు. ప్రకాశ్ రాజ్ ఎంతో కొంత మంచి చేస్తాడని చిరంజీవి నమ్మారని... మోహన్ బాబుతో మాట్లాడి ప్రకాశ్ రాజ్ ని ఓకే చేశారని తెలిపారు. అయితే, ప్రకాశ్ రాజ్ నిలబడిన తర్వాత మంచు విష్ణును మోహన్ బాబు నిలబెట్టారని చెప్పారు.
ఎన్నికల సమయంలో మోహన్ బాబు తన చెంప మీద కొట్టిన ఘటనపై స్పందిస్తూ బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు. మోహన్ బాబు సంస్కారం ఏమిటో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. స్టయిల్ కోసం 50 ఏళ్ల వయసులో సిగరెట్ తాగడాన్ని నేర్చుకున్నానని అన్నారు. ఎన్ని సినిమాలు చేశాననే విషయాన్ని లెక్క పెట్టుకోవడం, అవార్డులను ఇంట్లో పెట్టుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు.