Supreme Court: కేసుల పరిష్కారంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ రికార్డులు
- నాలుగు రోజుల్లో 1,293 కేసుల పరిష్కారం
- 440 బదిలీ కేసులకు విముక్తి
- వీలైనన్ని అధిక కేసులను పరిష్కరించడమే లక్ష్యమన్న చీఫ్ జస్టిస్
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ కేసుల పరిష్కారంలో రికార్డులు సృష్టిస్తున్నారు. చీఫ్ జస్టిస్ గా లలిత్ కేవలం 74 రోజుల పాటు పదవిలో ఉంటారు. నవంబర్ 8న ఆయన రిటైర్ అవుతారు. దీంతో తక్కువ వ్యవధిలో కేసులకు శరవేగంగా పరిష్కారం చూపించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు.
వారం క్రితం ఆగస్ట్ 27న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా లలిత్ బాధ్యతలు స్వీకరించారు. మొదటి నాలుగు రోజుల్లోనే సుప్రీంకోర్టులో 1,293 కేసులను పరిష్కరించారు. ప్రతి రోజు వీలైనన్ని కేసులను పరిష్కరించే లక్ష్యంతో సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించడం గమనార్హం.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్ జస్టిస్ యూయూ లలిత్.. మొదటి వారం రోజుల్లో కోర్టు పనితీరు గురించి తెలియజెప్పారు. గత నాలుగు రోజుల్లో ఏమి జరిగిందో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను బాధ్యతలు స్వీకరించడానికి ముందు కంటే ఎక్కువ కేసులను విచారణకు తీసుకురాగలిగాం. గత నాలుగు రోజుల్లో 1,293 కేసులను ముగించాం’’ అని వవరించారు.
1,293 కేసుల్లో ఆగస్ట్ 29న (బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి రోజు) 493, మంగళవారం 197, గురువారం 228 కేసులు, శుక్రవారం 315 కేసులు పరిష్కారమయ్యాయి. ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించే 106 రెగ్యులర్ కేసులను సైతం తేల్చేసినట్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ తెలిపారు. 440 కేసుల బదిలీ పిటిషన్లను పరిష్కరించినట్టు చెప్పారు. తన 74 రోజుల కాల వ్యవధిలో ప్రతి రోజూ వీలైనన్ని కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు.