Andhra Pradesh: ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరించిన ఏపీటీఎఫ్.. సర్కారీ సత్కారాలకు నో చెప్పిన ఉపాధ్యాయ సంఘం
- సీపీఎస్ అందోళనల్లో పాల్గొన్న వారిపై కేసుల నమోదు
- కేసులను నిరసిస్తూ ఏపీటీఎప్ కీలక నిర్ణయం
- ఏపీటీఎఫ్‌కు మద్దతు పలికిన యూటీఎఫ్
ఏపీలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను బహిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం పేరిట దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 5న కూడా ఈ వేడుకలకు రంగం సిద్ధం కాగా... ఏపీలో ఉపాధ్యాయులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన ఏపీటీఎఫ్... అందుకు నిరసనగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది.
ఈ నిరసనలో భాగంగా ఉపాధ్యాయ దిన వేడుకలను బహిష్కరించడంతో పాటుగా ప్రభుత్వం నుంచి అందే సన్మానాలను కూడా తిరస్కరించాలని ఏపీటీఎఫ్ నిర్ణయించింది. సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టడాన్ని కూడా ఏపీటీఎప్ తీవ్రంగా ఖండించింది. ఉపాధ్యాయులపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించింది. ఇదిలా ఉంటే... ఏపీటీఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయానికి యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) కూడా మద్దతు తెలిపింది. సోమవారం నాటి ఉపాధ్యాయ దినోత్సవాలకు హాజరు కారాదని తన సభ్యులకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది.