Bandi Sanjay: విమోచన దినోత్సవం జరపకుండా తెలంగాణ అమరవీరులను కేసీఆర్ దారుణంగా అవమానిస్తున్నారు: బండి సంజయ్
- సెప్టెంబరు 17న విమోచన దినోత్సవం
- అధికారికంగా ఎందుకు జరపరంటూ కేసీఆర్ ను ప్రశ్నించిన సంజయ్
- ఎంఐఎంకు భయపడ్డారంటూ విమర్శలు
- కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ విలీన వజ్రోత్సవాల పేరిట కేసీఆర్ మరో గిమ్మిక్కు చేసేందుకు పథక రచన చేస్తున్నారని, కేసీఆర్ అసలు సిసలు తెలంగాణ వాది అయితే, ఇచ్చిన మాట ప్రకారం విమోచన దినోత్సవం (సెప్టెంబరు 17) నిర్వహించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపకుండా తెలంగాణ అమరవీరులను కేసీఆర్ దారుణంగా అవమానిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఇచ్చిన మాట తప్పి తెలంగాణ అమరులను అవమానిస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ విమర్శించారు. మజ్లిస్ పార్టీకి భయపడి సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించడంలేదని, ఇది సిగ్గుచేటని పేర్కొన్నారు.
సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సిందేనంటూ ఏళ్ల తరబడి రాజీలేని పోరాటం చేస్తున్నది తమ పార్టీయేనని బండి సంజయ్ ఉద్ఘాటించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష జరపడం హర్షణీయం అని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహించడంలేదో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.