Pawan Kalyan: తహసీల్దార్ కార్యాలయంలో రైతు మృతి చెందిన ఘటనపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan opines on farmer death issue

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • తన భూమి కబ్జాకు గురవుతోందని రైతు ఆందోళన
  • పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంవద్ద దీక్ష
  • ఆకస్మికంగా మరణించిన వైనం
  • ప్రభుత్వ అలసత్వానికి బలయ్యాడన్న పవన్ కల్యాణ్

చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయంలో పి.రత్నం అనే రైతు మృతి చెందిన ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తిమ్మరాజు కండ్రిగలో అన్యాక్రాంతమైపోతున్న తన భూమిని కాపాడుకునేందుకు పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద దీక్ష చేస్తున్న రైతు పి.రత్నం ప్రభుత్వ అలసత్వానికి బలైపోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. న్యాయం కోసం దీక్ష చేపట్టిన ఒక సామాన్య రైతు ప్రాణాలు కోల్పోవడం మానవీయతకు మాయని మచ్చగా మిగిలిపోతుందని తెలిపారు. 

రత్నానికి చెందిన రెండెకరాల భూమిని గత ప్రభుత్వాల పెద్దలు ఇళ్ల స్థలాల నిర్మాణం కోసం తీసుకున్నారని, దీనిపై న్యాయం పోరాటం చేయగా 2009లో రత్నానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అయితే, న్యాయస్థానం ఉత్తర్వులను అధికారులు పాటించినట్టయితే ఒక బడుగు రైతు ప్రాణాలు పోయేవి కావని అభిప్రాయపడ్డారు. 

మిగిలిన కొద్దిపాటి భూమి కూడా ఆక్రమణలకు గురికావడంతో, న్యాయం చేయాలంటూ దీక్షకు దిగిన రత్నంపై కొందరు రెవెన్యూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందని పవన్ కల్యాణ్ వివరించారు. దాంతో ఆందోళనకు గురైన రత్నం అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. 

ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి ఉంటే ఒక రైతు ప్రాణం నిలబడి ఉండేదని స్పష్టం చేశారు. ఆ రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News