Rahul Gandhi: దేశంలో మోదీ వ్యాపింపజేస్తున్న విద్వేషం, భయాందోళనల వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు మాత్రం లాభపడుతున్నారు: రాహుల్ గాంధీ
- ధరల పెరుగుదల, కేంద్రం విధానాలపై కాంగ్రెస్ సభ
- ఢిల్లీ రామ్ లీలా మైదానంలో భారీ సభ
- ప్రసంగించిన రాహుల్ గాంధీ
- రెండు భారత దేశాలను సృష్టించారని వెల్లడి
- ఒకటి పేదల భారతదేశం అని వివరణ
- మరొకటి పారిశ్రామికవేత్తల భారతదేశం అని వ్యాఖ్యలు
దేశంలో ధరల పెరుగుదల, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఢిల్లీ రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో విద్వేషాన్ని, భయాన్ని వ్యాపింపజేస్తున్నారని, ఇది దేశానికి అత్యంత నష్టదాయకం అని పేర్కొన్నారు.
ఇలాంటి ధోరణులు దేశాన్ని ఎన్నటికీ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లలేవని అన్నారు. పైగా, శత్రుదేశాలకు ఇది వరంగా మారిందని వ్యాఖ్యానించారు. ఈ విద్వేషం, భయం ఇద్దరు పారిశ్రామికవేత్తలకు మాత్రం లాభదాయకంగా పరిణమించాయని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇప్పుడు రెండు భారతదేశాలను సృష్టించారని, ఒకటేమో పేదలు, రైతులు, నిరుద్యోగుల భారతదేశమని, మరొకటేమో కొంతమంది పారిశ్రామికవేత్తలకు చెందిన భారతదేశమని అభివర్ణించారు.
బీజేపీ, సంఘ్ నేతలను దేశాన్ని విభజిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే విద్వేషం, భయాలను పెంచిపోషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి వ్యతిరేకంగా ఎవరైనా గళమెత్తితే వారు 55 గంటల పాటు ఈడీ ఆఫీసులో విచారణ ఎదుర్కోవాల్సి వస్తోందని రాహుల్ గాంధీ వెల్లడించారు. అయితే తాను ఈడీ విచారణకు భయపడడంలేదని స్పష్టం చేశారు.
ఇప్పుడు తాము చేపడుతున్న భారత్ జోడో యాత్ర చాలా ముఖ్యమైనదని, తాము ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వాస్తవాలను వారికి వివరిస్తామని తెలిపారు. ప్రజలు ఎన్నో కఠిన సమస్యలు ఎదుర్కొంటున్నారని, పార్లమెంటులో ప్రజల తరఫున ప్రతిపక్షాలు గళం విప్పాలని ప్రయత్నిస్తే, మోదీ సర్కారు అందుకు ఒప్పుకోవడంలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో మీడియా, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలపై ఒత్తిడి నెలకొని ఉందని, ఈ వ్యవస్థలన్నింటిపైనా కేంద్రం దాడి చేస్తోందని వ్యాఖ్యానించారు.