Virat Kohli: సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న కోహ్లీ... పాకిస్థాన్ పై టీమిండియా భారీ స్కోరు
- ఆసియా కప్ లో టీమిండియా వర్సెస్ పాక్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
- నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 రన్స్ చేసిన భారత్
- 44 బంతుల్లో 60 పరుగులు చేసిన కోహ్లీ
గత కొన్నాళ్లుగా పరుగుల దాహంతో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జూలు విదిల్చాడు. పాకిస్థాన్ తో ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్ లో దూకుడుగా ఆడి ఫిఫ్టీ సాధించాడు. అది కూడా ఓ సిక్స్ తో అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. మహ్మద్ హస్నైన్ వేసిన ఆ బంతి గంటకు 149 కిమీ వేగంతో దూసుకురాగా, కోహ్లీ బ్యాట్ ను తాకిన అనంతరం బౌండరీ అవతల పడింది. కోహ్లీ కేవలం 36 బంతుల్లోనే అర్ధసెంచరీ మార్కు అందుకున్నాడు. మొత్తమ్మీద 44 బంతుల్లో 60 పరుగులు చేసిన కోహ్లీ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి వికెట్ కు 54 పరుగులు జోడించి శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేయగా, రాహుల్ 20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్ లతో 28 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 13, రిషబ్ పంత్ 14, దీపక్ హుడా 16 పరుగులు చేశారు.
ఆఖర్లో రవి బిష్ణోయ్ 2 బంతుల్లో రెండు ఫోర్లు కొట్టడం విశేషం. హార్దిక్ పాండ్య (0) డకౌట్ అయ్యాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీమ్ షా 1, మహ్మద్ హస్నైన్ 1, హరీస్ రవూఫ్ 1, మహ్మద్ నవాజ్ 1 వికెట్ తీశారు.