Jagan: సైరస్ మిస్త్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన జగన్
- నిన్న రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైరస్ మిస్త్రీ
- మిస్త్రీ మరణం పట్ల సంతాపాన్ని ప్రకటించిన జగన్
- గొప్ప వ్యాపార దిగ్గజమని కొనియాడిన సీఎం
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణంతో మన దేశ పారిశ్రామిక, వ్యాపార రంగ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయన మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. మిస్త్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మిస్త్రీ ఒక గొప్ప వ్యాపార దిగ్గజమని కొనియాడారు.
సైరస్ మిస్త్రీ వయసు 54 సంవత్సరాలు. నిన్న మరో ముగ్గురితో కలిసి అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్ఘార్ జిల్లా చరోటీ నాకా వద్ద 3.15 గంటల సమయంలో సూర్య నది వంతెనపై రోడ్డు డివైడర్ ను ఢీకొన్న మెర్సిడెస్ బెంజ్ కారు, ఆ తర్వాత రిటెన్షన్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మిస్త్రీతో పాటు మరొకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిస్త్రీ మరణంపై పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.