Madhya Pradesh: ప్రాణాలకు తెగించి పులి నోట్లో నుంచి బిడ్డను విడిపించిన మహిళ

Madhya Pradesh Woman Fights Off Tiger Saves Son From Its Jaws

  • మధ్యప్రదేశ్, ఉమారియా జిల్లా అటవీ పరిధిలో ఘటన
  • తన వెంట పొలానికి తీసుకెళ్లిన 15 నెలల చిన్నారిని నోట కరుచుకెళ్లిన పులి
  • బిడ్డను కాపాడేందుకు పులితో పోరాడిన 25 ఏళ్ల మహిళ

కన్న తల్లి ప్రేమ ఎంత గొప్పదో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ మహిళ ఏకంగా పులితో పోరాడింది. ప్రాణాలకు తెగించి పులి నోటి నుంచి తన బిడ్డను విడిపించుకుంది. మధ్యప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది.

ఉమారియా జిల్లా టైగర్ రిజర్వ్ అటవీ పరిధిలోని రోహనియా గ్రామానికి చెందిన 25 ఏళ్ల అర్చన చౌదరి అనే మహిళ పులితో పోరాడింది. ఆదివారం ఉదయం పొలానికి తీసుకెళ్లిన తన 15 నెలల కొడుకును పులి నోట కరుచుకొని వెళ్లడం చూసి ఆమె తల్లడిల్లింది. తన బిడ్డను ఎలాగైనా కాపాడుకోవాలని ప్రమాదకరమైన పులికి ఎదురెళ్లింది. తన ప్రాణాలను పణంగా పెట్టి సివంగిలా పులితో పోరాడింది. 

ఈ సమయంలో పులి ఆమెపై దాడి చేసింది. అయినా దాని నోట్లో నుంచి కొడుకును విడిపించే ప్రయత్నం చేసింది. ఈ సమయంలో ఆమె గట్టిగా అరవడంతో పక్క పొలాల్లో ఉన్న స్థానికులు అక్కడకు చేరుకొని పులిని తరిమారు. వాళ్లను చూసిన పులి ఈ చిన్నారిని వదిలేసి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. దాంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

తన బిడ్డను కాపాడుకునే క్రమంలో అర్చన తీవ్ర గాయాలపాలైంది. పులి దాడిలో ఆర్చన నడుము, చేయి, వెన్నుకు గాయాలయ్యాయని ఆమె భర్త భోళా ప్రసాద్ తెలిపాడు. కొడుకు రవిరాజ్ కు తల, వీపుపై గాయాలయ్యాయని చెప్పాడు. తల్లీకొడుకులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారులు  దాడి చేసిన పులిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లీ కొడుకులను జిల్లా కలెక్టర్ సంజీవ్ శ్రీ వాస్తవ పరామర్శించారు. ఏదేమైనా తన బిడ్డను కాపాడుకునేందుకు పులితో పోరాడిన ఆర్చన ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

  • Loading...

More Telugu News