Wikipedia: క్రికెటర్ అర్షదీప్ సింగ్ కు ‘ఖలిస్థానీ’తో లింక్.. వికీపీడియాకు కేంద్రం సమన్లు
- ఖలిస్థానీ నేషనల్ టీమ్ కు ఎంపికయ్యాడంటూ సమాచారం ఎడిట్
- పాక్ చేతిలో భారత్ ఓటమి తర్వాత చోటు చేసుకున్న మార్పు
- గుర్తించి వెంటనే సరిదిద్దిన వికీపీడియా
టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ కు సంబంధించి వికీపీడియాపై తప్పుడు సమాచారం వెలుగుచూసింది. అర్షదీప్ వికీపీడియా పేజీలో ఖలిస్థాన్ జాతీయ జట్టు పేరుతో సమాచారం వెలుగు చూసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల సామరస్యం దెబ్బతింటుందని , అతడి కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
దీంతో ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్ లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. ఆసియాకప్ సూపర్ 4లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత అర్ష దీప్ సింగ్ వికీపీడియా పేజీలో ఈ మార్పు చోటు చేసుకున్నట్టు సమాచారం. మ్యాచ్ లో భాగంగా కీలక క్యాచ్ ను అర్షదీప్ విడిచిపెట్టాడు. దీంతో అతడిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో మ్యాచ్ తర్వాత వికీపీడియా పేజీలో అర్ష దీప్ సింగ్ ‘ఖలిస్థానీ నేషనల్ క్రికెట్ టీమ్’కు ఎంపికయ్యాడనే విధంగా సమాచారాన్ని ఎవరో ఎడిట్ చేశారు. అయితే, ఆ వెంటనే దీనిని సరిచేశారు.
వికీపీడియా అనేది ఉచిత సమాచార వేదిక. ఎవరైనా అదనపు సమాచారాన్ని జోడించడం, లేదా ఉన్న సమాచారాన్ని ఎడిట్ చేయడం చేయచ్చు. లాగిన్ అయ్యి ఈ పనిచేయాల్సి ఉంటుంది. కనుక 'ఖలిస్థానీ' అని ఎడిట్ చేసిన వారిని గుర్తించే అవకాశం ఉంటుంది.