Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు... ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
- రేపటి నుంచే ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం
- ఫీజుల పెంపుపై ప్రతిపాదనలు అందించిన టీఎస్ఏఎఫ్ఆర్‌సీ
- ఆ ఫీజుల వసూలుకు కళాశాలలకు హైకోర్టు అనుమతి
- ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ఇంజినీరింగ్ విద్యకు సంబంధించి తెలంగాణలో ఫీజులు భారీగా పెరిగాయి. ఈ ఫీజుల పెంపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాకుండానే... పెంచిన ఫీజులను వసూలు చేసుకునేందుకు ఇంజినీరింగ్ కళాశాలలకు వెసులుబాటు లభించిన వైనంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇంజినీరింగ్ విద్య ఫీజులను పెంచుతూ తెలంగాణ స్టేట్ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటింగ్ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. ఈ ప్రతిపాదనల మేరకు పెంచిన ఫీజులను వసూలు చేసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రంలోని 79 కళాశాలలు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కళాశాలల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన హైకోర్టు... పెంచిన ఫీజుల వసూలుకు ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని 36 ఇంజినీరింగ్ కళాశాలల్లో వార్షిక ఫీజు ఏకంగా రూ.1 లక్ష దాటిపోయింది.
ఇదిలా ఉంటే... పెంచిన ఫీజులకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫలితంగా బీసీ, ఈబీసీ కోటా అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. మరోవైపు రేపటి నుంచే ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్ ప్రారంభమవుతున్నా ఫీజులపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం గమనార్హం.