Brahmastra: విడుదలకు ముందే వెబ్ సైట్లలో 'బ్రహ్మాస్త్ర' స్ట్రీమింగ్... 18 సైట్లను బ్లాక్ చేసిన ఢిల్లీ హైకోర్టు

Delhi High Court restrained websites to streaming Brahmastra movie

  • రణబీర్ కపూర్, అలియా జంటగా 'బ్రహ్మాస్త్ర'
  • పైరసీతో దిగ్భ్రాంతికి గురైన చిత్రబృందం
  • ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన స్టార్ ఇండియా
  • కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం

రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన భారీ చిత్రం 'బ్రహ్మాస్త్ర' సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, విడుదలకు ముందే ఈ చిత్రం పలు వెబ్ సైట్లలో స్ట్రీమింగ్ అవుతుండడం పట్ల చిత్రబృందం దిగ్భ్రాంతికి గురైంది. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, 'బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ' చిత్రాన్ని అనధికారికంగా స్ట్రీమింగ్ చేస్తున్న 18 వెబ్ సైట్లను హైకోర్టు బ్లాక్ చేసింది. 

అక్రమ స్ట్రీమింగ్ పై ఆందోళన వ్యక్తం చేస్తూ స్టార్ ఇండియా సంస్థ న్యాయస్థానంలో దావా వేసింది. ఓ సినిమాను తొలుత థియేటర్లలో విడుదల చేయడం, ఆ తర్వాత వివిధ వేదికలపై ప్రదర్శించేందుకు అనుమతించడం జరుగుతుందని స్టార్ ఇండియా కోర్టుకు వివరించింది. ఓ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ అనేది వాణిజ్యపరంగా ఎంతో ముఖ్యమైన దశ అని తెలిపింది. అయితే, కొన్ని దుర్మార్గపు వెబ్ సైట్లు అక్రమార్జన కోసం చిత్రాలకు సంబంధించిన కాపీలను సంపాదించి అక్రమ రీతిలో ప్రసారం చేస్తున్నాయని ఆరోపించింది. 

దీనిపై వాదనలు విన్న జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం తన అభిప్రాయాలు వెల్లడించింది. బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ చిత్రాన్ని, దానికి సంబంధించిన కంటెంట్ ను కలిగివుండడం, స్ట్రీమింగ్ చేయడం, పునఃప్రసారం చేయడం, ప్రదర్శించడం, చూడ్డానికి డౌన్ లోడ్ చేయడానికి వీలుగా కంటెంట్ ను అందుబాటులో ఉంచడం, అప్ లోడ్ చేయడం, నవీకరించడం, మార్పులు చేర్పులతో ప్రసారం చేయడం, ఇంటర్నెట్ ద్వారా, మరే ఇతర వేదిక ద్వారా వెబ్ సైట్లు షేర్ చేయడం అనేది ఆ సినిమా సొంతదారు హక్కులను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 18 వెబ్ సైట్లను గుర్తించి బ్లాక్ చేసింది. తదుపరి విచారణ వరకు తమ ఆదేశాలు అమల్లో ఉంటాయని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. 

అంతేకాదు, కేంద్ర టెలీకమ్యూనికేషన్స్ విభాగానికి, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖకు కూడా ఆదేశాలు జారీ చేసింది. సదరు దుష్ట వెబ్ సైట్లకు అనుమతి నిరాకరించేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టం చేయాలని కేంద్రానికి నిర్దేశించింది. పైరసీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని, పైరసీ ఎక్కడున్నా ఉక్కుపాదంతో అణచివేయాలని కోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News