Supreme Court: ఎన్నికల్లో ఈవీఎంలను నిషేధించాలన్న పిటిషన్పై విచారణకు అంగీకరించని సుప్రీంకోర్టు
- ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టాలని పిటిషన్
- పిటిషన్ను దాఖలు చేసిన న్యాయవాది జయ సుకిన్
- ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పేందుకు బ్యాలెట్ పేపర్లే మార్గమన్న పిటిషనర్
ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను నిషేధించాలన్న పిటిషన్పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయవాది సీఆర్ జయ సుకిన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను విచారించకుండానే సుప్రీంకోర్టు కొట్టేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను వినియోగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుకిన్ పిటిషన్ దాఖలు చేశారు.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ సహా ప్రపంచంలోని పలు దేశాలు ఈవీఎంలను వదిలేసి బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నాయని సుకిన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా దేశంలో ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పేలా ఎన్నికల ప్రక్రియలో బ్యాలెట్ పేపర్ల విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది.