Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
- దేశాన్ని కుదిపేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్
- హైదరాబాద్, బెంగళూరు, ముంబై, లక్నో తదితర నగరాల్లో ఈడీ సోదాలు
- హైదరాబాద్ లో ముగ్గురి ఇళ్లలో కొనసాగుతున్న రెయిడ్స్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కుంభకోణంపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను ప్రారంభించింది. తెలంగాణ సహా ఢిల్లీ, మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా లోని పలు నగరాల్లో ఈడీ సోదాలు జరుపుతోంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గురుగ్రామ్, లక్నో తదితర నగరాల్లో ఈడీ అధికారులు రెయిడ్స్ నిర్వహిస్తున్నారు.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ప్రేమ్ సాగర్, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అయితే, సోదాలు జరుపుతున్న విషయాన్ని ఈడీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇదే కేసుకు సంబంధించి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అధికార నివాసంలో సోదాలు జరిపిన సంగతి తెలిసిందే.
మరోవైపు, లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆప్ మండిపడుతోంది. కేంద్ర వ్యవస్థలను ఉపయోగించుకుంటూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిందని... బీజేపీలోకి వస్తే ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసిందని అన్నారు. ఇంకోవైపు, తమ ఎక్సైజ్ పాలసీపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో... పాలసీని ఆప్ ప్రభుత్వం ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.