Demat accounts: దేశంలో మొదటిసారిగా 10 కోట్లు దాటిన డీమ్యాట్ ఖాతాలు
- ఒక్క ఆగస్ట్ నెలలోనే 22 లక్షల కొత్త ఖాతాలు
- గత రెండేళ్లలో తెరుచుకున్నవే ఎక్కువ
- 7.16 కోట్ల ఖాతాలతో అగ్ర స్థానంలో సీడీఎస్ఎల్
డీమ్యాట్ ఖాతాల సంఖ్య దేశంలో శరవేగంగా పెరిగిపోతోంది. మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారనేందుకు నిదర్శనంగా.. మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 10 కోట్లను దాటింది. ఆగస్ట్ లో కొత్తగా 22 లక్షల డీమ్యాట్ ఖాతాలు తెరుచుకోవడంతో వీటి సంఖ్య 10.05 కోట్లకు చేరింది.
మన దేశంలో డీమ్యాట్ ఖాతాలు 2020 మార్చి నాటికి 4.09 కోట్లుగానే ఉన్నాయి. అదే సమయంలో కరోనా వైరస్ మహమ్మారి రాకతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడం తెలిసిందే. స్టాక్స్ చౌకగా లభిస్తుండడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. ఫలితంగా నాటి నుంచి డీమ్యాట్ ఖాతాలు పెరుగుతూ పోతూనే ఉన్నాయి. దేశంలో డీమ్యాట్ ఖాతాలను ఆఫర్ చేసే డిపాజిటరీలు రెండే ఉన్నాయి. సీడీఎస్ఎల్, ఎన్ఎస్ డీఎల్. వీటిల్లో సీడీఎస్ఎల్ 7.16 కోట్ల ఖాతాలో అతి పెద్ద సంస్థగా ఉంది.