YS Jagan: మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజి, పెన్నా బ్యారేజిలను ప్రారంభించిన సీఎం జగన్
- నెల్లూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన
- సంగం వద్ద గౌతమ్ రెడ్డి బ్యారేజి ప్రారంభోత్సవం
- లాంఛనంగా బటన్ నొక్కిన సీఎం జగన్
- వైఎస్, మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాల ఆవిష్కరణ
- మేకపాటి కుటుంబ సభ్యులకు ఆత్మీయ ఓదార్పు
ఏపీ సీఎం జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆత్మకూరు నియోజకవర్గం సంగం వద్ద మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజి, నెల్లూరులో పెన్నా బ్యారేజిలను ఆయన ప్రారంభించారు. తన పర్యటనలో భాగంగా సంగం బ్యారేజి వద్ద దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని, దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఇక నెల్లూరు జిల్లాలో కరవు మండలమే ఉండదని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేశామని వెల్లడించారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరిట నామకరణం చేశామని, ఆయన మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని వివరించారు. సంగం, నెల్లూరు బ్యారేజిల నిర్మాణం కోసం రూ.380 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టును తాను పూర్తిచేసినందుకు గర్విస్తున్నానని తెలిపారు.
కాగా, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆయన తనయుడు, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రతిపాదనకు సీఎం జగన్ సభాముఖంగా ఆమోదం తెలిపారు. గౌతమ్ రెడ్డి జ్ఞాపకాలతో విషాదంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని ఓదార్చారు.