Cease Fire: మరోసారి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఉల్లంఘనకు తెగబడిన పాకిస్థాన్
- జమ్మూలోని ఆర్నియా సెక్టార్ లో కాల్పులు
- పాక్ కాల్పులకు దీటుగా బదులిచ్చిన బీఎస్ఎఫ్ జవాన్లు
- గతేడాది కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణ
- యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న పాక్
పాకిస్థాన్ కుటిల బుద్ధి మరోసారి బయటపడింది. జమ్మూకశ్మీర్ లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి మరోసారి తూట్లు పొడిచింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సరిహద్దు పొడవునా తూటాల మోత మోగించింది. పాక్ రేంజర్లు ఎలాంటి కవ్వింపులు లేకుండానే భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లపై కాల్పులు జరిపారు.
ఇవాళ ఉదయం జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్ లో పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ దీటుగా జవాబిచ్చిందని బీఎస్ఎఫ్ డిప్యూటీ ఐజీ ఎస్పీఎస్ సంధు వెల్లడించారు. బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీని లక్ష్యంగా చేసుకుని పాక్ దళాలు తుపాకీలకు పనిచెప్పాయని వివరించారు. అయితే, భారత్ వైపున ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని బీఎస్ఎఫ్ జమ్మూ ప్రాంత పీఆర్వో వెల్లడించారు.
గతంలో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ గతేడాది ఫిబ్రవరిలో భారత్, పాక్ ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే పాక్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పరిపాటిగా మారింది.