Etela Rajender: అసెంబ్లీ స్పీకర్ పోచారం ఒక కీలుబొమ్మ: ఈటల రాజేందర్
- కేసీఆర్ చెప్పినట్టు చేయడమే తప్ప స్పీకర్ చేసేదేమీ లేదు
- గత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా సస్పెండ్ చేశారు
- కేసీఆర్ కు ప్రజల చేతిలో శిక్ష
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో స్పీకర్ ఒక కీలుబొమ్మ అని అన్నారు. కేసీఆర్ చెప్పినట్టు చేయడమే తప్ప... స్పీకర్ చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా సభ నుంచి సస్పెండ్ చేశారని మండిపడ్డారు.
ఉమ్మడి ఏపీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్న పార్టీని కూడా బీఏసీ సమావేశాలకు పిలిచేవారని... టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సభ సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే తమ సమస్యలను సభలో ప్రస్తావించాలని పలు రంగాల వారు విన్నవించుకునే పద్ధతి ఉండేదని చెప్పారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాల రోజులను కూడా తగ్గించేశారని ఈటల అన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాల నుంచి తప్పించుకోవచ్చు కానీ... ప్రజల చేతిలో మాత్రం సీఎంకు శిక్ష తప్పదని జోస్యం చెప్పారు. అసెంబ్లీలో అవకాశం వస్తే ప్రజా సమస్యలపై మాట్లాడతామని... లేదంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు.