Crypto Currency: కృష్ణా జిల్లాలో క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు... పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

Cheating in the pretext of crypto currency

  • రూ.82 లక్షల మేర కుచ్చుటోపీ
  • అనేకమంది నుంచి డబ్బు వసూలు
  • సిద్ధంశెట్టి ఆనంద కిశోర్ అనే వ్యక్తి అరెస్ట్ 

కృష్ణా జిల్లా అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో క్రిప్టో కరెన్సీ పేరిట ఓ ముఠా రూ.82 లక్షల మేర ప్రజలకు టోకరా వేసినట్టు వెల్లడైంది. ఈ ముఠా సభ్యుల్లో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

అవనిగడ్డ పరిసరాల్లో క్రిప్టో కరెన్సీ పేరిట దాదాపు 70 మంది నుంచి డబ్బులు వసూలు చేశారని, అక్రమ మార్గంలో సులువుగా డబ్బు సంపాదించే ఉద్దేశంతో క్రిప్టో కరెన్సీ పేరిట వల విసిరారని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సిద్ధంశెట్టి ఆనంద కిశోర్ ను పులిగడ్డ వారధి వద్ద కారులో వెళుతుండగా అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. అతడి నుంచి ల్యాప్ టాప్, సెల్ ఫోన్, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. మిగతా నిందితులను కూడా పట్టుకుంటామని తెలిపారు.

కాగా, నిందితులు విజయవాడ, అవనిగడ్డ, గుడివాడకు చెందినవారిగా భావిస్తున్నారు. ట్రస్ట్ వ్యాలెట్ (యూకే) అనే వెబ్ సైట్ ఏర్పాటు చేసి ఈ మేరకు క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలకు దిగినట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News