Telangana: స్పీకర్‌కు క్షమాపణ చెప్పకుంటే చర్యలు తప్పవు!: ఈటలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరిక
- 6 నిమిషాల్లో వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ
- సీఎం చెప్పినట్లు స్పీకర్ వింటున్నారన్న ఈటల
- ఈటల వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు గుప్పించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీరుపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన స్పీకర్ స్థానంలో ఉన్న పోచారంపై విమర్శలు చేయడం తగదని హితవు పలికిన ప్రశాంత్ రెడ్డి... ఈటల తన తప్పును తెలుసుకుని తక్షణమే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈటలపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
మంగళవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బీఏసీ సమావేశం తర్వాత సమావేశమైన అసెంబ్లీ కేవలం 6 నిమిషాలకే వాయిదా పడింది. ఈ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటల రాజేందర్.. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా స్పీకర్ నడుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను మంత్రి ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు.