Delhi: ఢిల్లీలో ఈసారి కూడా దీపావళిని నిశ్శబ్దంగా జరుపుకోవాల్సిందే!
- ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో వాయు కాలుష్యం
- దీపావళి సమయంలో టపాసులపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కార్
- టపాసులు పేల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం ఎన్నో సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం కూడా కాలుష్యాన్ని తగ్గించడానికి ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కఠినమైన ఆంక్షలను కూడా విధిస్తోంది. ఈ క్రమంలో, గత ఏడాది మాదిరే ఈసారి కూడా దీపావళి సమయంలో టపాసులను కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది.
టపాసులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. జవనరి 1వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈసారి టపాసుల ఆన్ లైన్ విక్రయాలపై కూడా నిషేధం విధించామని తెలిపారు. అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి నిషేధం విధించక తప్పదని ఆయన అన్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా టపాసులను పేల్చితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, టపాసులపై నిషేధం విధించడంతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.