Justin Bieber: వరల్డ్ టూర్ ని అర్థాంతరంగా ఆపేసిన జస్టిన్ బీబర్.. కారణం ఇదే!
- రామ్సే హంట్ సిండ్రోమ్ బారిన పడిన జస్టిన్ బీబర్
- ముఖంలోని కొంత భాగం పక్షవాతానికి గురైందన్న బీబర్
- షో తర్వాత శారీరకంగా, మానసికంగా చాలా అలసటకు గురవుతున్నానని వ్యాఖ్య
- కోలుకోవడానికి సమయం పడుతుందని వెల్లడి
- బీబర్ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న అభిమానులు
ప్రఖ్యాత కెనెడియన్ సింగర్ జస్టిన్ బీబర్ తన 'జస్టిస్' వరల్డ్ టూర్ ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించాడు. అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిపాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. బీబర్ వరల్డ్ టూర్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆయన టూర్ మధ్యలోనే ఆగిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. బీబర్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో తాను రామ్సే హంట్ సిండ్రోమ్ బారిన పడ్డానని.. దీని వల్ల తన ముఖంలోని కొంత భాగం పక్షవాతానికి గురయిందని బీబర్ తెలిపాడు. ఈ కారణం వల్ల జస్టిస్ వరల్డ్ టూర్ లో మిగిలి పోయిన ఉత్తర అమెరికా టూర్ ను పూర్తి చేయలేకపోతున్నానని ప్రకటించాడు. అనారోగ్యానికి గురైన తర్వాత తన డాక్టర్లు, కుటుంబ సభ్యులు, తన టీమ్ తో సంప్రదించిన తర్వాత టూర్ ను కొనసాగించేందుకు యూరప్ కు వెళ్లానని... ఆరు లైవ్ షోలు చేశానని, అయితే ఇది తనకు మరింత భారంగా పరిణమించిందని చెప్పాడు.
చివరి వీకెండ్ లో బ్రెజిల్ లోని రియో డిజెనీరోలో నిర్వహించిన షోలో తన శక్తిమేర పర్ఫామెన్స్ ఇచ్చానని బీబర్ తెలిపాడు. షో పూర్తయిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఎంతో అలసటకు గురయ్యానని చెప్పాడు. ఈ క్రమంలో ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యతను ఇవ్వాలనే విషయం తనకు అర్థమయిందని తెలిపాడు. ఈ నేపథ్యంలో తన వరల్డ్ టూర్ కి కొంత కాలం పాటు బ్రేక్ ఇస్తున్నానని చెప్పాడు. తాను కోలుకుంటానని... అయితే, దీనికి సమయం పడుతుందని తెలిపాడు. ఇన్నేళ్లపాటు తనకు అండగా నిలిచిన, తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానన్నాడు.
జస్టిన్ బీబర్ చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాప్యులర్ అయ్యాడు. ప్రస్తుత జస్టిస్ వరల్డ్ టూర్ ను ఆయన ఈ ఏడాది మార్చిలో ప్రారంభించాడు. అయితే, రామ్సే హంట్ సిండ్రోమ్ కారణంగా జూన్ లో పలు షోలను రద్దు చేసుకున్నాడు. తన ముఖం కుడివైపు కదలిక విషయంలో ఇబ్బంది పడుతున్నానని, కన్ను కూడా కొట్టుకుంటోందని, ముక్కుకు సంబంధించిన ఇబ్బంది ఉందని, తన నోరు కుడివైపు నుంచి మాత్రమే కొంత నవ్వగలుగుతున్నానని జూన్ లో ఇన్స్టాలో బీబర్ వెల్లడించాడు.