China: చైనాలో అద్భుత కట్టడం.. ప్రపంచంలోనే మోస్ట్ ట్విస్టెడ్ టవర్ ‘డ్యాన్స్ ఆఫ్ లైట్’ ప్రత్యేకతలు ఇవిగో!
- కింది నుంచి పైదాకా మెలితిరిగి ఉన్న భారీ భవనం
- చైనాలోని చోంగ్ క్వింగ్ నగరంలో ఆవిష్కరణ
- 180 మీటర్ల ఎత్తుతో.. 8.8 డిగ్రీల మెలికతో నిర్మాణం
ఎక్కడైనా భవనమంటే నిటారుగా నిలబెట్టినట్టు కడతారు. కావాలంటే విశాలమైన స్థలంలో వేర్వేరుగా భారీ టవర్లను కట్టి మధ్యలో అనుసంధానం చేస్తుంటారు. కానీ ఓ భవనాన్ని గట్టిగా పట్టుకుని మెలితిప్పేసినట్టుగా కడితే.. అదో రకంగా ఉంటుంది కదా. ప్రపంచవ్యాప్తంగా ఇలా కొన్నిచోట్ల మెలితిరిగినట్టుగా ఉండే డిజైన్ తో భవనాలు కడుతున్నారు. అయితే ప్రపంచంలోని అత్యంత మెలికలు తిరిగిన భారీ టవర్ ను ఇటీవల చైనాలోని చోంగ్ క్వింగ్ నగరంలో నిర్మించారు.
డ్యాన్స్ ఆఫ్ లైట్ పేరుతో..
- పశ్చిమ చైనాలోని చోంగ్ క్వింగ్ నగరంలో ఇటీవలే ‘డ్యాన్స్ ఆఫ్ లైట్’ పేరుతో ఈ సరికొత్త భవనాన్ని ప్రారంభించారు. ఈడస్ అనే సంస్థ ఈ భవనాన్ని డిజైన్ చేసి నిర్మించింది.
- 180 మీటర్లు (590 అడుగుల) ఎత్తుతో నిర్మించిన ఈ భవనం 8.8 డిగ్రీల మెలికతో కింద నుంచి పై వరకు తిప్పేసినట్టు ఉండటం గమనార్హం.
- సాధారణంగా భూమి ఉత్తర ధ్రువాల వద్ద ఆకాశంలో అరోరా బొరియాలిస్ అనే చిత్రమైన కాంతులు వెదజల్లుతుంటాయి. ఈ భవనం కూడా అలా కాంతులను వెదజల్లుతుందని, ఈ క్రమంలో ‘డ్యాన్స్ ఆఫ్ లైట్’ అని పేరు పెట్టినట్టు నిర్మాణ సంస్థ తెలిపింది.
- ఈ భవనం కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వివిధ కోణాల్లో కాంతిని ప్రతిఫలింపజేస్తూ మెరుస్తూ ఉంటుందని.. రాత్రిపూట వివిధ దిక్కుల నుంచి వచ్చిన కాంతిని మరింతగా ప్రతిఫలింపజేస్తుందని వివరించింది.
- ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇలా మెలితిరిగి ఉన్న భారీ భవంతులు అతికొద్ది చోట్ల మాత్రమే ఉన్నాయి. అందులో దుబాయిలోని 306 మీటర్ల ఎత్తయిన కయాన్ టవర్, స్వీడన్ లోని టర్నింగ్ టోర్సో భవనాలు ప్రఖ్యాతి పొందాయి. అయితే వాటికంటే ‘డ్యాన్స్ ఆఫ్ లైట్’ భవనం ఎక్కువగా మెలితిరిగి ఉంటుంది.