UK: ఇక్కడ మేఘాలు పుట్టడాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు!.. జిబ్రాల్టర్ కొండ శిఖరం వీడియోలు ఇవిగో
- స్థానిక వాతావరణ పరిస్థితులతో ‘బ్యానర్ క్లౌడ్’ తరహా మేఘాలు ఏర్పడే అవకాశం
- ఏడాదిలో దాదాపు ఐదు నెలల పాటు కొండ వద్ద మేఘాలు
- చిత్రమైన ఆకారాల్లో మేఘాలు ఏర్పడటంపై సోషల్ మీడియాలో పోస్టులు కూడా..
ఆకాశంలో అంతెత్తున మేఘాలను మనం రోజూ చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి మొత్తం ఆకాశాన్ని కప్పేసి భారీ వర్షాలు కురిపించడమూ మనకు తెలిసిందే. కానీ ఓ చోట మాత్రం ఓ పెద్ద కొండ మేఘాలకు పుట్టినిల్లుగా మారింది. ఏదో పాత్ర నుంచి నీటి ఆవిరి వస్తున్నట్టుగా.. ఆ పెద్ద కొండ నుంచి మేఘాలు పుడుతూనే ఉంటాయి. కలిసి పెద్ద మేఘంలా మారి వెళ్లిపోతాయి. ఆ తర్వాత మరో మేఘం ఏర్పడుతూ ఉంటుంది.
అదే పెద్ద ఏక రాతి కొండ
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) పరిధిలో జిబ్రాల్టర్ ద్వీపకల్పం ఉంది. అందులో సముద్ర తీరానికి కాస్త దూరంలో ఉన్నదే ఈ ఎత్తయిన జిబ్రాల్టర్ కొండ. దాదాపుగా మొత్తం ఒకే రాయితో ఏర్పడిన ఈ కొండ ఒక వైపున ఏకంగా 426 మీటర్ల (1,398 అడుగులు) ఎత్తున శిఖరం ఉంటుంది. అది సముద్రానికి అభిముఖంగా ఉండి.. అటు నుంచి వచ్చే గాలికి అడ్డుగా ఉంటుంది. ఈ క్రమంలో సముద్రం వైపు నుంచి వచ్చే గాలి ఈ కొండను తాకుతుండగా.. మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి.
బ్యానర్ క్లౌడ్ గా పిలిచే మేఘాలివి..
- ఎక్కడైనా గాలి వీచే దిశలో పెద్ద పెద్ద పర్వతాలుగానీ, ఎత్తయిన కొండలుగానీ ఉన్నప్పుడు.. వీస్తున్న గాలి వాటికి తాకి పైకి లేస్తుంది. అలా పైకి వెళ్లినచోట తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా.. ఆ గాలిలోని నీటి ఆవిరి చల్లబడి చిక్కబడుతుంది. మంచు స్పటికాలుగా మారడం మొదలై మేఘాలు ఏర్పడతాయి.
- ఇలా పర్వతాలు, కొండల కారణంగా ఏర్పడే మేఘాలను ‘బ్యానర్ క్లౌడ్’గా పిలుస్తుంటారు. జీబ్రాల్టర్ కొండ వద్ద ఏర్పడే మేఘాలు కూడా ఇదే తరహావి అని బ్రిటన్ వాతావరణ శాఖ తెలిపింది.
- జిబ్రాల్టర్ వాతావరణ పరిస్థితుల మేరకు ఏటా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ చిత్రాన్ని గమనించవచ్చని స్థానికులు చెబుతున్నారు.
- ఈ కొండ, ఈ ప్రాంతం అద్భుతమంటూ కొందరు నెటిజన్లు, తాము ఓసారి అక్కడికి వెళ్లామని, ఈ అద్భుతాన్ని చూశామని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
- ఇక ఓ జంట అయితే తాము వెళ్లినప్పుడు ఐదు రోజులు ఉన్నామని.. ఆ ఐదు రోజులూ ఇలా మేఘం ఏర్పడి తామున్న హోటల్ పొద్దంతా నీడలోనే ఉండిపోయిందని వాపోవడం గమనార్హం.
- ఇక ఈ కొండ నుంచి ఏర్పడే మేఘాలు ఒక్కోసారి చిత్రమైన ఆకారాల్లో ఉండటంపై.. సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు కూడా పెడుతున్నారు.