Andhra Pradesh: తీరు మార్చుకోకపోతే కేబినెట్‌నే మారుస్తా!.. మంత్రులకు క్లాస్ పీకిన జగన్!
- కేబినెట్ భేటీ తర్వాత గంట పాటు మంత్రులతో జగన్ భేటీ
- విపక్షాల విమర్శలకు దీటుగా జవాబివ్వాలని ఆదేశం
- పధ్ధతి మార్చుకోకపోతే మంత్రివర్గాన్ని మారుస్తానని హెచ్చరిక
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాటి కేబినెట్ భేటీ ముగిశాక... తన మంత్రివర్గ సహచరులపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ భేటీ ముగిశాక దాదాపుగా గంట పాటు మంత్రులకు క్లాస్ పీకిన జగన్... విపక్షాల విమర్శలపై కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారని ఆయన మంత్రులను నిలదీశారు.
ప్రభుత్వ కార్యకలాపాలపై విమర్శలు వచ్చినా స్పందించకుంటే... అసలు మంత్రులు ఉన్నట్టా? లేనట్టా? అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ తరహా అలసత్వం ఎంతమాత్రం తగదని కూడా ఆయన హెచ్చరించారు.
ఇటీవలే వెలుగు చూసిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో జగన్‌తో పాటు ఆయన భార్య భారతి రెడ్డిలకు ప్రమేయం ఉందంటూ విపక్షం టీడీపీ చేసిన ఆరోపణలపై ఏపీ కేబినెట్‌లోని మంత్రుల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించిన దాఖలా లేదు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ... నేరుగా తన కుటుంబం మీద వచ్చిన ఆరోపణలపైనా స్పందించరా? అని జగన్ నిలదీశారు. ఇదే తరహా పరిస్థితి కొనసాగితే... మంత్రివర్గాన్ని మార్చాల్సి వస్తుందని కూడా జగన్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పధ్ధతి మార్చుకోవాలని... పార్టీ, ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు ఖండించాలని, వాటికి కౌంటర్లు ఇవ్వాలని ఆయన సూచించారు.