Ants: ఎర్ర చీమల దెబ్బకు ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు.. రాణి చీమ కోసం వెతుకుతున్న శాస్త్రవేత్తలు!

Ants invasion forces people to flee from Odisha village

  • ఒడిశాలోని పింప్లి తాలూకా బ్రహ్మంసాహి గ్రామంలో ఘటన
  • వరదలతో ఉప్పొంగిన సమీపంలోని నది 
  • అడవి, పొదల నుంచి ఊరిపైకి వచ్చిన చీమలు 
  • రాణి చీమలను గుర్తించి చంపేస్తే బెడద పోతుందంటున్న శాస్త్రవేత్తలు

ఎర్ర చీమ కుడితే ఎలా ఉంటుంది? వామ్మో మంటే మంట.. అది కూడా తెలియదా అంటారా.. ఓసారి కుడితే తెలుస్తుందిలే అంటారా.. మరి ఒక్క ఎర్ర చీమకే మనం వణికిపోతే.. ఒడిశాలోని ఓ గ్రామం మొత్తాన్ని ఎర్ర చీమలు ముంచెత్తాయి. కోట్లకొద్దీ చీమలు ఆ ఊరిపై దండెత్తాయి. ఇళ్లు, రోడ్లు, పొలాలు, చెట్లు, చేమలు.. ఇలా ఎక్కడ చూసినా ఎర్ర చీమలే. అడుగు పెడితే కుట్టేస్తుండటంతో ఊరు ఊరంతా గగ్గోలు పెట్టింది. చివరికి ఊరి వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. 

ప్రశాంతంగా తినలేకపోతున్నాం..
‘‘ఎర్ర చీమల కారణంగా మేం ఇక్కడ బతకలేకపోతున్నాం. ప్రశాంతంగా తినలేకపోతున్నాం, నిద్రపోలేకపోతున్నాం, కనీసం ఎక్కడైనా కూర్చోలేని పరిస్థితి. చీమల భయం కారణంగా మా పిల్లలు బడికి కూడా వెళ్లడం లేదు. అందుకే ఊరు వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాం..” అని ఈ గ్రామానికి చెందిన రేణుబాల డాష్ అనే మహిళ వాపోయారు. ఆమె తన కుటుంబంతో కలిసి సమీప గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నట్టు తెలిపారు.

అధికారుల ఉరుకులు పరుగులు
ఒడిశాలోని పూరి జిల్లా పిప్లి తాలూకా బ్రహ్మంసాహి గ్రామంలో రెండు నెలల కిందట ఎర్ర చీమల బెడద మొదలైంది. ఇది మెల్లగా పెరిగి ఊరంతా చీమలమయంగా మారింది. గ్రామస్థులు ఈ చీమల బాధ తట్టుకోలేక ఊరు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఇదే ప్రాంతానికి చెందిన చంద్రదేయిపూర్ గ్రామానికి కూడా చీమల ముప్పు మొదలైంది. ఈ విషయం తెలియడంతో ప్రభుత్వ అధికారులు ఆ ఊరిని పరిశీలించారు. ఒడిశా అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అధికారులు కలిసి అక్కడ చీమల బెడదను తొలగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

వరద కారణంగా అడవిని వదిలి..
ఈ గ్రామానికి కాస్త దూరంలో నది ఉందని, నదికి గ్రామానికి మధ్య అడవి ఉందని ఒడిశా అగ్రికల్చర్ వర్సిటీ శాస్త్రవేత్త సంజయ్ మహంతి తెలిపారు. వరద రావడంతో అడవి, పొదల్లోని చీమలు గ్రామంలోకి వచ్చి నివాసం ఏర్పర్చుకున్నాయని పేర్కొన్నారు. చీమలు ఎక్కడి నుంచి గ్రామంలోకి ప్రవేశిస్తున్నాయనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఆ మూల కేంద్రంలో రాణి చీమలు ఉంటాయని, వాటిని చంపేస్తే ఈ చీమల బెడద ఆగిపోతుందని వివరించారు. ప్రస్తుతానికి ఊరి చుట్టూ పొదల్లో చీమల మందు చల్లుతున్నామని తెలిపారు. కాగా ఇంతకు ముందు 2013లో ఫాలిన్ తుపాను సమయంలో పూరి జిల్లాలోని దండ గ్రామంపై ఇలా చీమలు దాడి చేసిన ఘటన నమోదైంది.

  • Loading...

More Telugu News