Nirmala Sitharaman: ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా
- భారత్ పర్యటనకు విచ్చేసిన ఐఎంఎఫ్ చీఫ్
- ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం
- పలు అంశాలపై చర్చ
- భారత ఆర్థిక వ్యవస్థను కొనియాడిన జార్జియేవా
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఎండీ క్రిస్టలీనా జార్జియేవా భారత పర్యటనకు విచ్చేశారు. ఆమె ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. జీ20 దేశాల అధ్యక్ష పదవి భారత్ చేపట్టనుండడంపై ఇరువురు చర్చించారు. ఈ విషయంలో భారత్ కు మద్దతు ఇస్తామని ఐఎంఎఫ్ చీఫ్ హామీ ఇచ్చారు.
నిర్మల, క్రిస్టలీనా జార్జియేవా మధ్య జరిగిన చర్చల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తున్న అంశాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా దేశాల మధ్య తలెత్తే సమస్యలు, ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆర్థిక స్థితిగతులపైనా చర్చించారు. ఆహార, ఇంధన ధరలల్లో పెరుగుదల, అంతర్జాతీయ అప్పుల భారం అధికమవడం వంటి కారణాలతో ప్రపంచ ద్రవ్యోల్బణం పైపైకి ఎగబాకుతోందని... స్థూలంగా దీని ప్రభావం అల్పాదాయ దేశాలపై పడుతోందని ఇరువురు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తమవుతున్న క్రిప్టో కరెన్సీ అంశం కూడా నిర్మలా సీతారామన్, క్రిస్టలీనా జార్జియేవాల మధ్య చర్చకు వచ్చింది. క్రిప్టో సంపద నియంత్రణకు ప్రపంచవ్యాప్త సమన్వయం అవసరమని వారు పేర్కొన్నారు. ఈ దిశగా ఐఎంఎఫ్ కీలకపాత్ర పోషించాలని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
ఇక, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలోనూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఉజ్వలంగా వెలుగుతోందని జార్జియేవా ప్రశంసించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసమానతలు, అసమతుల్యతను పరిష్కరించే దిశగా సరైన సకాలంలో జీఆర్ క్యూ (జనరల్ రివ్యూ కోటా) అమలు చేయాల్సి ఉందని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడగా... క్రిస్టలీనా జార్జియేవా అందుకు ఏకీభవించారు.
.