Assam: భారత్ జోడో యాత్ర కాదు.. అఖండ భారత్ కోసం యాత్ర చేయండి: రాహుల్‌పై అసోం సీఎం ఫైర్
- దేశాన్ని భారత్-పాక్‌లుగా విడగొట్టింది కాంగ్రెస్సేనన్న అసోం సీఎం
- అఖండ భారత్ కోసం కృషి చేయాలని సూచన
- బంగ్లాదేశ్ ప్రధాని భారత్‌లో పర్యటిస్తున్న వేళ వ్యాఖ్యలు
‘భారత్ జోడో’ యాత్ర కాదు.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఏకీకృతం చేసి ‘అఖండ భారత్’ కోసం కృషి చేయాలంటూ రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆయనీ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో’ యాత్రను విమర్శించే క్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్రపై స్పందించాల్సిందిగా మీడియా కోరగా ఆయనిలా స్పందించారు.
కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన సీఎం.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ ఇప్పుడు ఐక్యంగానే ఉందని అన్నారు. సిల్చార్ నుంచి సౌరాష్ట్ర వరకు మనమంతా ఒకటేనని అన్నారు. భారత్‌ను కాంగ్రెస్సే భారత్, పాకిస్థాన్‌గా విడగొట్టిందని, ఆ తర్వాతే బంగ్లాదేశ్ ఏర్పడిందన్నారు. రాహుల్ గాంధీ కనుక తన కుటుంబం చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడితే ఆయన భారత్ జోడో యాత్ర కాకుండా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను కలిపే అఖండ భారత్ కోసం కృషి చేయాలని అన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
కాగా, నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన హసీనా.. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.