Kunamneni Sambasiva Rao: నాటకీయ పరిణామాల మధ్య.. సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక
- కూనంనేని సాంబశివరావుతో పోటీ పడ్డ పల్లా వెంకట్ రెడ్డి
- కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు
- గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పని చేసిన కూనంనేని
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. శంషాబాద్ లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నికకు సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు వాడీవేడి చర్చలు నడిచాయి. రాష్ట్ర కార్యదర్శి పదవికి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి పోటీ పడ్డారు. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి కీలక నేతలు ప్రయత్నించినప్పటికీ ఇద్దరూ పట్టు విడవలేదు. దీంతో, ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికలో కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు పడ్డాయి. దీంతో, కూనంనేని గెలుపొందినట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని పని చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేశారు.
మరోవైపు, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట్ రెడ్డి రెండు సార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడో సారి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, తన ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు. అయితే, ఈసారి అవకాశం తనకు ఇవ్వాలని కూనంనేని పట్టుబట్టడంతో... చాడ వెంకటరెడ్డి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలో పల్లా వెంకటరెడ్డి తెరపైకి వచ్చారు. చివరకు కూనంనేని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.