Airtel: 5జీ ఫోన్ తీసుకోండంటూ కస్టమర్లకు ఎయిర్ టెల్ లేఖ

Airtel is urging users to buy 5G smartphones ahead of expected launch next month

  • ఫోన్లు మారుస్తున్నట్టు అయితే 5జీకి మారిపోవాలని సూచన
  • ఈ డిసెంబర్ నాటికి మెట్రోల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని లేఖ
  • అన్ని రకాల 5జీ ఫోన్లకు ఎయిర్ టెల్ సేవలు అందుతాయని వెల్లడి

ఎయిర్ టెల్ ఇంకా 5జీ సేవలు మొదలు పెట్టనేలేదు.. అప్పుడే కస్టమర్ల వెంట పడుతోంది. ఫోన్ మారుస్తున్నట్టు అయితే 5జీ ఫోన్ తీసుకోవాలని తన కస్టమర్లను భారతీ ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ కోరారు. ఈ మేరకు కస్టమర్లకు ఒక లేఖ రాశారు. కస్టమర్లు త్వరలోనే ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్ లో తాముంటున్న లొకేషన్ లో 5జీ సేవలు ఉన్నాయా? లేవా? అన్నది చెక్ చేసుకోవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో అక్టోబర్ లో 5జీ సేవలు మొదలవుతాయని ఎయిర్ టెల్ ఇప్పటికే ప్రకటించింది. రిలయన్స్ జియో సైతం దీపావళి నుంచి 5జీ సేవలు ఆరంభమవుతాయని ప్రకటించడం తెలిసిందే.

‘‘నెలలో 5జీ సేవలు ప్రారంభిస్తాం. డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా కీలక మెట్రోల్లో 5జీ సేవల కవరేజీ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వేగంగా 5జీ సేవలను విస్తరిస్తాం. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 5జీ సేవలు కవర్ అవుతాయని అంచనా వేస్తున్నాం’’ అని గోపాల్ విట్టల్ తెలిపారు.

నాన్ స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) ఆధారంగా ఎయిర్ టెల్ 5జీ నెట్ వర్క్ ఏర్పాటు చేశామని చెప్పారు. దీనివల్ల అన్ని రకాల 5జీ స్మార్ట్ ఫోన్లపై ఎయిర్ టెల్ నెట్ వర్క్ ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకుండా పని చేస్తుందని ప్రకటించారు. అదే ఇతర సాంకేతికత ఆధారంగా అయితే ప్రతి ఐదు 5జీ ఫోన్లలో నాలుగు సపోర్ట్ చేయవన్నారు.

  • Loading...

More Telugu News