Breakfast: బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఈ నాలుగు.. మరువద్దు..!
- ఫైబర్ ఉన్న పదార్థాలకు చోటు ఇవ్వాలి
- ఆరోగ్యకర కొవ్వులు కూడా అవసరమే
- బ్రేక్ ఫాస్ట్ మానడం మంచిది కాదు
- తీసుకునే ఆహారంతో ప్రొటీన్ ఉండాలి
బ్రేక్ ఫాస్ట్ (రోజులో మొదటి ఆహారం) విషయంలో చాలా మంది ఎలాంటి ప్రత్యేక శ్రద్ధ చూపించరు. టిఫిన్లలో తమకు నచ్చింది తినేస్తుంటారు. కానీ, వైద్య శాస్త్రం ప్రకారం బ్రేక్ ఫాస్ట్ అన్నది రోజులో అతి ముఖ్యమైన ఆహార సేవనం అని గుర్తు పెట్టుకోవాలి. కనుక దీని విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపించాల్సిందే. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు బ్రేక్ ఫాస్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా మసలుకోవాలి. ఎందుకంటే వీరు తీసుకునే ఆహారమే రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నిర్ణయిస్తుంది.
ఫైబర్
ఆహారంలో భాగంగా శరీరంలోకి వచ్చే పీచుతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ స్థాయుల నియంత్రణకు ఇది కీలకం. తీసుకునే ఆహారంలో పీచు ఉంటే అది ఒకేసారి శక్తిగా మారకుండా, క్రమంగా కొంత సమయం తీసుకుని ఈ ప్రక్రియ జరుగుతుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరిగిపోదు. పీచు తక్కువగా, కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థం) ఎక్కువగా ఉన్న వాటిని బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా తింటే రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరిగిపోతుంది. ఇది మీ శక్తి, ఆకలిని నిర్ణయిస్తుంది. ప్రతి 5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ కు ఒక గ్రాము పీచు ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అందుకని పీచు ఉన్న కూరగాయలను, ఓట్స్ ను బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి.
బ్రేక్ ఫాస్ట్ మానడం
బ్రేక్ ఫాస్ట్ తీసుకోని వారు కూడా మన సమాజంలో చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారు బ్రేక్ ఫాస్ట్ ను మానకూడదు. ఎందుకంటే వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ఉదయానికి చాలా తక్కువగా ఉంటాయి. కనుక తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. లేదంటే బ్లడ్ గ్లూకోజ్ లో అస్థిరతలు గుండె, మూత్రపిండాలపై పడతాయి.
మధుమేహం లేని వారు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల ప్రభావం వేరేగా ఉంటోంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గిపోతున్నాయి. దీనివల్ల హైపోగ్లైసీమియా లక్షణాలు అయిన అధిక హృదయ స్పందనలు, వణుకు, చెమటలు పట్టడం, చిరాకు, తల తిరగడం కనిపిస్తాయి. కనుక మధుమేహం లేని వారు సైతం బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం మంచిది కాదు.
ప్రొటీన్
కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, ఫైబర్, ఫ్యాట్ ఇవన్నీ కలిస్తేనే సమతులాహారం అవుతుంది. ప్రొటీన్లు తగినంత లేకపోతే అది కూడా రక్తంలో గ్లూకోజ్ పెరిగేందుకు దారితీస్తుంది. కార్బోహైడ్రేట్లతో కలిపి ప్రొటీన్ తీసుకోవాలి. దీనివల్ల రక్తంలోకి కార్బోహైడ్రేట్ల విడుదల నిదానంగా ఉంటుంది.
ఆరోగ్యకర కొవ్వులు
ఆహారంలో కొవ్వు పదార్థాలు ఉన్నా, అప్పుడు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ నిదానంగా జరుగుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ ఒకేసారి పెరగకుండా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉన్న భావనతో ఉంటారు. దీనివల్ల తీసుకునే ఆహారం కూడా తగ్గుతుంది. అవకాడో, నట్స్ వంటివి తినొచ్చు.