TDP: రాజారెడ్డికే భయపడలేదు... జగన్‌కు భయపడతామా?: నారా లోకేశ్
- తెనాలిలో నరేంద్రనాథ్ కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్
- ఇప్పటిదాకా తనపై 15 కేసులు నమోదు చేశారన్న టీడీపీ నేత
- తనకు పోలీస్ స్టేషన్ అత్తారిల్లులా మారిపోయిందని వ్యాఖ్య
టీడీపీ నేతలపై ఏపీలో వరుసగా జరుగుతున్న దాడులపై ఆ పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవలే మరణించిన పార్టీ నేత పాటిబండ్ల నరేంద్రనాథ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. మంగళగిరి, కుప్పం, తెనాలిల్లో టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొందన్న లోకేశ్... అసలు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంతలా భయపడుతోందన్నారు.
జగన్ తాత రాజారెడ్డికే తాము భయపడలేదని... ఇప్పుడు జగన్‌కు భయపడతామా? అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా తనపై 15 కేసులు పెట్టారన్న లోకేశ్... 7 సార్లు తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. వెరసి గతంలో ఏనాడూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని తనకు ఇప్పుడు పోలీస్ స్టేషన్ అత్తారిల్లులా మారిపోయిందని ఆయన చమత్కరించారు. ఏమైనా, ప్రజలకు మంచి చేయాలన్న తలంపుతోనే ముందుకు సాగుతున్నామని, వైసీపీ ప్రభుత్వానికి భయపడే ప్రసక్తే లేదని లోకేశ్ చెప్పారు.